Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'చెప్పులు మోసే గుజరాతీ గులాములను తెలంగాణ గమనిస్తోంది....' అంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మునుగోడులో నిర్వహించిన 'బీజేపీ సమరభేరి' సభలో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొన్న విషయం తెలిసిందే. మునుగోడు పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్ చేరుకున్న అమిత్షా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అమిత్ షాకు చెప్పులు అందిస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్లో షేర్ చేస్తూ స్పందించారు. ''ఢిల్లీ 'చెప్పులు' మోసే గుజరాతీ గులాములను.. ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ణి తెలంగాణ గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్దంగా ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయనిపుణులతో కవిత చర్చలు
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. బీజేపీఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై ఆమె పరువు నష్టం దావా వేయనున్నట్టు సమాచారం. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును ఆమె అశ్రయించనున్నారు. ఈ అంశంపైఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నారు.
గాంధీ ఆస్పత్రి సిబ్బందికి హరీశ్ అభినందనలు
గాంధీ ప్రభుత్వాస్పత్రిలో తొలిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి మూడేండ్ల చిన్నారికి ఉన్న వినికిడి లోపాన్ని సరిదిద్దిన గాంధీ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు.