Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
- పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా అడ్డగించిన తల్లిదండ్రులు
- కెజి సిరిపురంలో ఘటన
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాధం రామారావు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సోమవారం ఉదయం పాఠశాలకు వస్తున్న సమయంలో గ్రామ నడిబొడ్డున విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసి ప్రశ్నించటమే గాక అతనికి దేహశుద్ది చేశారు. అదే సమయంలో సమీపంలోని సర్పంచ్ మట్టూరి ప్రసన్నాంబ ఇంటికి పరిగెత్తి రక్షణ తీసుకున్నాడు. సర్పంచ్ ద్వారా విషయం తెలుసుకున్న వైరా, తల్లాడ ఎస్ఐలు సిరిపురం చేరుకుని ప్రధానోపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎస్ఐలు గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినలేదు. వారి సమక్షంలోనే ప్రధానోపాధ్యాయుడిపై మరోసారి దాడికి పాల్పడగా, ఉద్రిక్తత నెలకొంది. చాలా సేపు పోలీస్ వాహనాన్ని కదలనీయలేదు. పోలీస్ వాహనంపై రాళ్ళు రువ్వారు. ఉద్రిక్త నడుమ అతన్ని వైరా తీసుకొచ్చారు. వైరా చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ భర్త మట్టూరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మట్టూరి కృష్ణారావు తదితరులు ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడారు. ఇకపై సిరిపురం పాఠశాలకు రాకుండా ఉండే షరతులతో రాజీ పడినట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ శాఖమూరి వీర ప్రసాద్‌ను వివరణ కోరగా ప్రధానోపాధ్యాయుడు రామారావుపై ఆరోపణలు వచ్చిన మాట నిజమేనని, అతనిపై కోపోద్రిక్తులైన ప్రజలు దాడి చేసిన సమయంలో రక్షణ తీసుకున్నాడని, అతన్ని స్టేషన్‌కు తరలించామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి ఎటువంటి దరఖాస్తు రాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.