Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్‌రూరల్
'సాగు భూమిని దర్జాగా కబ్జా చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులకు చెప్పినా స్పందన లేదు. ఇక మేం బతికి ఎందుకు? కలెక్టరేట్ వద్ద కాల్చుకొని చస్తాం' అని పెట్రోల్ డబ్బాలతో వచ్చిన రైతులు మెదక్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. కౌడిపల్లి మండలం పేట పంచాయతీ పరిధిలోని బి వెంకటాపూర్ గ్రామానికి చెందిన 15 మంది రైతులకు సంగాయిపేట గ్రామ శివారులో తాతల కాలం నుంచి సర్వేనెంబర్ 313, 298లో 50 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో పట్టాలు కూడా పొందారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌తోపాటు మరికొందరు 25 ఎకరాల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని రైతులు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహించిన రైతులు నారాయణ, పరశురాం, విఠల్, శేఖయ్యతోపాటు మరికొందరు పెట్రోల్ బాటిళ్లతో కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. తర్వాత పెట్రోల్ ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు పట్టించుకోకపోతే తమకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కలెక్టర్ న్యాయం చేయకపోతే చావే శరణ్యమని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే భార్యాపిల్లలతో కలిసి వచ్చి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.