Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ- ముషీరాబాద్
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం చేసిన అగ్ని కణం షోయబ్ ఉల్లాఖాన్ అని ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో షోయబ్ ఉల్లాఖాన్ వర్ధంతి సభ నిర్వహించారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు వినయ కుమార్, సారంపల్లి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వంతోపాటు భూస్వామ్య పెత్తందారుల ఆగడాలను తన కలంతో ఎండగట్టిన యోధుడు షోయబ్ ఉల్లాఖాన్ అని గుర్తు చేశారు. రైతులపై విధించే పన్ను, తెలంగాణ సమాజాన్ని వెట్టి మనుషులుగా మార్చిన సందర్భంలో రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైనటువంటి సోయబ్ ఉల్లాఖాన్ జర్నలిస్టుగా ప్రజల పక్షాన వార్తలు రాస్తూ సమాజాన్ని చైతన్య పరిచారని చెప్పారు. దీనిని జీర్ణించుకోలేని నిజాం పాలకులు అత్యంత కిరాతకంగా షోయబ్ ఉల్లాఖాన్ను హత్య చేశారని తెలిపారు. అదే నిరంకుశ దోరణితో నేటి పాలకులు వ్యవహరిస్తున్నారని, ప్రశ్నిస్తున్న పౌర హక్కుల నాయకులపై, జర్నలిస్టులపై మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలు, నిరంకుశత్వాలు ఎంతో కాలం నిలబడవన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీపీఐ(ఎం) నాయకులు జి.రాములు, ఆవాజ్ నాయకులు అలీ తదితరులు పాల్గొన్నారు.