Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలి : టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ స్కూల్ అనుబంధ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను సమీప కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ (ఎస్వో)లకు బాధ్యత ఇస్తూ ప్రొసీడింగ్ ఇవ్వడం సమంజసం కాదని, రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు. ప్రస్తుత కేజీబీవీల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు సుమారు 360 మంది బాలికలున్నారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి అదనంగా మోడల్ స్కూల్ అనుబంధ హాస్టళ్ల బాలికలు మరో 150 మంది స్థాయికి మించిన భారం పడుతుందని పేర్కొన్నారు. తద్వారా కేజీబీవీ బాలికల సామర్థ్యం దెబ్బ తింటుందని వివరించారు. గత నెలలో సంచాలకులు ఇచ్చిన ప్రొసీడింగ్‌ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశామని గుర్తు చేశారు. అయినా పట్టించుకోకుండా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌వోలను టెర్మినేట్ చేస్తామంటూ బెదిరిస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వారి జాబ్ చార్ట్‌లో లేని బాధ్యతలు బలవంతంగా రుద్దడం సరైంది కాదన్నారు. మోడల్ స్కూల్ అనుబంధ హాస్టళ్లకు ప్రత్యేక వార్డెన్ పోస్టును సృష్టించి వెంటనే నియమించాలని విద్యాశాఖ కార్యదర్శిని డిమాండ్ చేశారు.
బెదిరింపు చర్యలకు టీపీటీఎఫ్ ఖండన
మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఇటీవల కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ల (ఎస్వో)కు అప్పగిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందని టీపీటీఎఫ్ అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్వోలు ఈ విధులు నిర్వహించడానికి నిరాకరించా రని పేర్కొన్నారు. అయితే విద్యాశాఖ సంచాలకులు ఆన్లైన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, రెండు రోజుల్లో విధుల్లో చేరకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ బెదిరింపు చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి వారి జాబ్ చార్ట్‌లో మోడల్ స్కూల్ హాస్టళ్ల నిర్వహణ బాధ్యత లేదని గుర్తు చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా కనీస వేతన చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పటికే ఎస్వోలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. బోధనవైపు బాధ్యతలు నిర్వహించా ల్సిన వారికి బోధనేతర పనులు అప్పగించడం సరైంది కాదని సూచించారు. కేజీబీవీల్లో కాని, మోడల్ స్కూళ్లలో కాని హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఎస్వోలపై బెదిరింపు చర్యలను, వేధింపులను ఆపాలనీ, అన్యాయం జరిగితే వారి హక్కుల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.