Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ మనవడు ఒకరోజు సంక్షేమ హాస్టల్లో ఉండగలడా? : బీజేపీ ఎమ్మెల్యే ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో టీచర్లు, విద్యావాలంటీర్లు, గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు జీతాలు రాక అత్యాహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చేసిన పనులకు డబ్బులు రాక కాంట్రాక్టర్లు, బిల్లులు రాక సర్పంచ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం వండిపెట్టే వారికీ జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దీంతో నాణ్యత లేని వస్తువులు, పాడైన కూరగాయలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉంటున్నారని వివరించారు. భోజనంలో బొద్దింకలు, వానపాములు రావడం పేద పిల్లల మీద కేసీఆర్కు ఉన్న శ్రద్ధకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆయన మనవడు ఒకరోజు సంక్షేమ హాస్టల్లో ఉండగలడా?అని ప్రశ్నించారు. అక్కడే స్నానం చేసి, బసచేసి, అక్కడి పిల్లలు ఏం తింటున్నారో అదే తినాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్న గెస్ట్ లెక్చరర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నారనీ, వాటికి సీఎం కేసీఆర్ భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం జూన్ 15 నుంచి ప్రారంభమైనా ఇప్పటి వరకు వారిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. వారికి నెల నెలా జీతాలు ఇవ్వకుంటే బతికేది ఎలా? అని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.