Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు మెస్ బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు మెస్ బిల్లులు చెల్లించాలని సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించి రెణ్నెల్లు దాటిందని తెలిపారు. ఇప్పటి వరకు వాటి నిర్వహణ కోసం గ్రాంట్లు విడుదల చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా పాఠశాల గ్రాంట్లు ఇస్తారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులిస్తాయని పేర్కొన్నారు.
ఏటా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటివారంలో కేంద్రం 60 శాతం గ్రాంట్లను విడుదల చేస్తుందని వివరించారు. ఈ ఏడాది కేంద్రం నిర్లక్ష్యం వల్ల నిర్వహణ గ్రాంటు విడుదల కాలేదని విమర్శించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు మెస్ బిల్లులూ చెల్లించలేదని తెలిపారు. పాఠశాలల నిర్వహణకయ్యే ప్రతిపైసా ప్రధానోపాధ్యాయులు వారి జీతాల నుంచి భరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఖర్చునూ వారి జీతాల నుంచే భరించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి సమగ్ర శిక్ష పథకం గ్రాంటును విడుదల చేయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులనైనా విడుదల చేసి పాఠశాలలకు నిర్వహణ గ్రాంట్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు మెస్ బిల్లులు విడుదల చేయాలని తెలిపారు.