Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ పీవోలు, ఆర్‌సీఓల తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గిరిజన గురుకులాల్లో పలు సమస్యల పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు.పరిగణించారు. ఇకపై నిరంతరం గురుకుల విద్యాలయాల్లో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకులాల్లో ప్రస్తుత పరిస్థితులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇంగ్లీష్ బోధనతోపాటు గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందనీ, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందించాల్సిన పుస్తకాలతోపాటు, ఇతర సౌకర్యాలు, మంచినీరు, నాణ్యమైన ఆహారం, శానిటేషన్ ,పరిసరాల పరిశుభ్రత పై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ,అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీ విజయలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ చందన, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్డి చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.