Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగీ కేసులు
- 2017తో పోల్చితే 2021 నాటికి డబుల్
- రికార్డుస్థాయిలో 2019లో 13,110 కేసులు
- ఈ ఏడాది మరింతగా వ్యాప్తి చెందుతున్న జ్వరాలు
- ఇప్పటికే రెండువేలకు పైగా డెంగీ పాజిటివ్
వ్యాధులు ముసురుతున్నాయి.. డెంగీ.. మలేరియా.. చికెన్ గున్యా.. స్వైన్ ఫ్లూ.. టైఫాయిడ్.. కోవిడ్.. విష జ్వరాలు.. ఇలా పలు వైరస్లు మూకుమ్మడి దాడి చేస్తూ వణుకు పుట్టిస్తున్నాయి. అసలే వానాకాలం.. ఆపై వ్యాధుల కాలం కావడంతో.. గతితప్పుతున్న పరిస్థితులు రోగాల విజంభణకు కారణమవుతున్నాయి. ఏటా లక్షల్లో జ్వరం కేసులు నమోదయ్యే గిరిజన ప్రాంతాలతో సహ రాష్ట్రమంతా జ్వరాల తీవ్రత పెరిగేలా ఉంది.. నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యానికి రూ.కోట్లు కుమ్మరిస్తున్నా.. రోగాల కుంపట్లా మారుతున్నాయి. అధ్వాన పారిశుధ్య పరిస్థితులు. స్థానిక సంస్థల పాలకుల నిర్లక్ష్యం వెరసి రోగాలు ముసురుతున్నాయి.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ డెంగీ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 2000కు పైగా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థా యిలో 2019లో అత్యధికంగా 13,110 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఎడతెరపిలేని వర్షాలతో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జ్వర పీడితుల సంఖ్య భారీగా నమోదయ్యే ప్రమాదం ఉందని వైద్యరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. దోమల నివారణే జ్వరాల నియంత్రణకు ఏకైక మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. డెంగీతో పాటు మలేరియా, చికున్‌గున్యా కేసులు కూడా నమోదవుతు న్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మలేరియా, డెంగీ పోటాపోటీగా ప్రజలను పీడిస్తున్నాయి. ప్రయివేటు, ఆర్ఎంపీల వద్దకు వచ్చే కేసులను మినహాయిస్తేనే జ్వరాల కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈనెల 13వ తేదీ నాటికి 84 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా పదిరోజుల్లోనే ఈ సంఖ్య డబుల్ అయింది. సోమవారం నాటికి జిల్లాలో 169 డెంగీ పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400కు పైగా జ్వరపీడితులున్నట్టు వైద్యరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోనూ జ్వరాలు కోరలు చాస్తున్నాయి. గతేడాది జులై నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 200 కేసులు మాత్రమే నమోదు కాగా ఈ ఏడాది వెయ్యి మంది వరకు డెంగీ బారిన పడ్డారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రోజుకు 10-15 వరకు డెంగీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు చెబుతున్నారు.
చెత్త డంపింగే ప్రధాన సమస్య..!
పారిశుధ్య లోపం కారణంగా దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మానికి సమీపంలోని మంచుకొండ, ఖమ్మంలోని మామిళ్లగూడెం యూపీహెచ్సీల పరిధిలో అత్యధిక డెంగీ కేసులు నమోదవడానికి బీసీ కాలనీకి సమీపంలోని డంపింగ్‌యార్డు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ 169 కేసులు నమోదవగా మంచుకొండ పీహెచ్సీ పరిధిలో 33, యూపీహెచ్సీ మామిళ్లగూడెంలో 20 డెంగీ పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. జిల్లాలో 31శాతానికి పైగా కేసులు ఈ రెండు హెల్త్‌సెంటర్ల పరిధిలోనే నమోదయ్యాయి.
భద్రాద్రిలో కలుషిత నీరే కారణం..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలు, అధిక వర్షాలతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. చర్ల మండలంలో వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో మలేరియా, డెంగీ జ్వరాలు అధికంగా వ్యాపిస్తున్నాయి. పెద్దమిడిసిలేరు, బత్తినపల్లిలో రెండిళ్లకొకరు మంచాన పడ్డారు. పెద్దమిడిసిలేరులో 60 కుటుంబాలకు గాను 30 జ్వరం బారినపడ్డాయి. ఇటు భద్రాచలం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం తదితర వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక చోట్ల మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో కలుషిత నీరు తాగి ప్రజలు జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పగటిపూట దోమకాటే డేంజర్
డెంజర్ డెంగీ జ్వరానికి పగటిపూట ఎడిస్ దోమ కాటే కారణం. ఇది నీరు నిల్వ ఉండే చోట ఎక్కువగా ఉంటుంది. ఈ దోమకాటుకు గురైతే 103-104 డిగ్రీల జ్వరం వస్తుంది. జ్వరం తగ్గాక క్రమంగా ప్లేట్లెట్లు తగ్గుతాయి. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ప్లేట్లెట్ల సంఖ్య ఉండాల్సి ఉండగా లక్షన్నర కన్నా దిగువకు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. దీన్ని సకాలంలో గుర్తిస్తే 80శాతం వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్లేట్ల సంఖ్య 50వేల కన్నా తగ్గితే మాత్రం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. జిల్లాలో రోజుకు 250 వరకు పరీక్షలు నిర్వహిస్తుండటంతో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదకర స్థాయిలో డెంగీ జ్వరాలు లేకపోవడం ఒకింత ఊరట.
- డా|| సంధ్య, ఖమ్మం జిల్లా మలేరియా అధికారి