Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే కమీషన్లో వేతనాలు తీసుకోండంటూ అధికారుల ఆదేశాలు..
- మనస్తాపంతో పినపాక సీఈఓ ఆత్మహత్యాయత్నం
- వేతనాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని వినతి
నవతెలంగాణ-వెంకటాపురం
రైతులకు రాయితీలపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు వారు పండించిన పంటలను కొనుగోలు చేస్తూ సేవలు అందించే సహకార సంఘాల ఉద్యోగులకు నాలుగైదు నెలలుగా జీతాలు లేక ఇబ్బం దుల్లో కొట్టుమిట్టాడు తున్నారు. వేతనాలు రాక పోవడంతో మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండ లానికి చెందిన సహకార సంఘం సీఈఓ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన సీఈవో అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా ఉద్యోగు లందరూ కలిసి వైద్యం చేయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమకు జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని జీతాలు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని సహకార సంఘం ఉద్యోగులు ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంటున్నారు.
వరంగల్, ములుగు జిల్లాలో 12 సహకార సంఘాల్లో సుమారు 74 మంది ఉద్యోగులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 98 సహకార సంఘాలకు 490 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
వ్యాపారం చేసుకొని వేతనాలు తీసుకోండి..
ములుగు జిల్లా వెంకటాపురం సహకార సంఘం ద్వారా రైతులతో వ్యాపారం చేసుకొని వచ్చే కమీషన్లో నుంచి వేతనాలు తీసుకోవాలని ఉద్యోగులకు ఉన్నతాధికారులు చెబుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
గతంలో మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అందించే రాయితీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సహకార సంఘాలకు సరఫరా చేసే వారు. రైతులకు విక్రయించిన అనంతరం వచ్చిన సొమ్మును మార్క్‌ఫెడ్‌లో జమచేసి అమ్మకంపై వచ్చిన కమీషన్‌ను సహకార సంఘం ఖాతాలో జమ చేసేవారు. కాసీ ఇప్పుడు ముందుగా సొమ్ము చెల్లిస్తేనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిస్తామని ఆంక్షలు విధించడంతో ఈ ఏడాది సహకార సంఘాల విక్రయించే పరిస్థితులు లేవు.
వడ్ల కొనుగోలు కమీషన్లో కోత..
రైతుల వద్ద నుంచి ఖరీఫ్, రబీలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసినందుకు వచ్చే కమీషన్ నుండైనా ఉద్యోగుల వేతనాలు చెల్లిస్తారని అనుకుంటే అందులోనూ కోతలు విధిస్తున్నారు. గన్నీ బ్యాగుల లెక్కలు, వడ్ల కొనుగోలు సమయంలో మిల్లర్లు విధించిన కోతలకు సహకార సంఘం ఉద్యోగులే బాధ్యత వహించాలని అధికారులు చెబుతున్నారు. దాంతో సంఘం ఉద్యోగుల్లో ఒత్తిడి మొదలైంది. ఇటు 4 నెలలుగా సక్రమంగా వేతనాలు రాక మరోవైపు ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లర్ల తరుగులకు మీరే బాధ్యులని అధికారులు తెలపడంతో సహకార సంఘాల ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఉద్యోగుల వేతనాలు అందించాలి..
సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు కమీషన్‌తో సంబంధం లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సహకార ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మిల్లర్ల తరుగు, గన్నీ బ్యాగుల లెక్కలకు సహకార సంఘం ఉద్యోగులను బాధ్యులను చేయొద్దంటూ
కోరారు.