Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగదు ప్రవాహంపై ఒత్తిడి
- దూకుడు పెట్టుబడులతో ప్రమాదమే
- క్రెడిట్‌సైట్స్ హెచ్చరిక
- పడిపోయిన షేర్ల విలువ
హైదరాబాద్ : దేశంలో ఆ రంగం.. ఈ రంగం అని కాకుండా అన్నిటిలోకి వేగంగా అడుగులు వేస్తోన్న గౌతమ్ అదానీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు లేకపోలేదని ఫిచ్ గ్రూపునకు చెందిన క్రెడిట్ సైట్స్ విశ్లేషించింది. అదానీ గ్రూపు భారీగా అప్పులు తెచ్చి కొత్త వ్యాపారాల్లో దూకుడుగా పెట్టుబడులు పెడుతోన్న విషయాన్ని క్రెడిట్ సైట్స్ గుర్తు చేసింది. అప్పులతో ఆ సంస్థ రుణ ప్రమాణాలు, కొలమానాలు, నగదు ప్రవాహం (క్యాష్ ఫ్లో) అంశాలు ఒత్తిడికి గురైతున్నాయని పేర్కొంది. ఒక వేళ ఇదే విధానం కొనసాగితే.. పరిస్థితి చేజారి పోవచ్చని.. మున్ముందు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశమూ ఉందని క్రెడిట్‌సైట్స్ మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. 2022 మార్చి ముగింపు నాటికి అదానీ గ్రూపులోని ఆరు లిస్టెడ్ కంపెనీలు స్థూలంగా రూ.2.31 లక్షల కోట్ల అప్పులు చేసి ఉన్నాయి. ఇతర కంపెనీల అప్పుల వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు.
క్రెడిట్ సైట్స్ వివరాలు..
''సంబంధం లేని వ్యాపారాల్లోకి అదానీ గ్రూపు ప్రవేశిస్తోంది. ఇవి అధిక మూలధన వ్యయాలు కలిగి ఉన్నాయి. అమలు, పర్యవేక్షణకు సంబంధించిన ఇబ్బందులున్న వ్యాపారాల్లోనూ ప్రవేశిస్తోంది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు, అదానీ గ్రూపు మధ్య నెలకొన్న మార్కెట్ ఆధిపత్య పోటీలో భాగంలో అర్థంలేని నిర్ణయాలకు దారీ తీయవచ్చు. మోడీ ప్రభుత్వంతో అదానీ బలమైన సంబంధాలు కలిగి ఉండటంతో పాలసీ విధానాల్లోనూ లబ్ధి పొందుతున్నారు. బ్యాంక్‌లతోనూ బలమైన సంబంధాలు కలిగి ఉంది.'' అని క్రెడిట్ సైట్స్ తది నివేదికలో పేర్కొంది. తమ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ ప్రతినిధిని సంప్రదించగా స్పందించలేదని క్రెడిట్ సైట్స్ వెల్లడించింది.
1980లో కమోడిటీ వ్యాపారాలను ప్రారంభించిన గౌతమ్ అదానీ కేవలం 20 ఏళ్లలోనే అనేక రంగాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఈ గ్రూపు గనులు, ఓడరేవులు విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్, రక్షణ, వంట నూనెలు, సెజ్‌లు, మీడియా, ఇంధన పునరుత్పాదన తదితర రంగాల్లో విస్తరించింది. ఇటీవలే అల్యూమినియం రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఒడిస్సాలో రూ.58వేల కోట్లతో అల్యూమినియం రిఫైనరీ, ముడి ఇనుప ఖనిజం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదానీ సంపద గంటకు రూ. 83.4 కోట్లుగా, రోజుకు రూ.1000 కోట్లుగా ఉందని ఫోర్బ్స్ అంచనా. ప్రపంచ అపారకుబేరుల్లో బిల్‌గేట్స్‌ను అధిగమించి అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు.
షేర్ల దిగాలు..
క్రెడిట్ సైట్ రిపోర్ట్‌లో మంగళవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ పవర్ షేర్ 4.99 శాతం, అదానీ విల్మర్ సూచీ 4.73 వాతం, అదానీ గ్రూన్ ఎనర్జీ సూచీ 4.15 శాతం చొప్పున కుప్పకూలాయి. ఇంట్రాడేలో అదానీ పవర్, విల్మర్ సూచీలు లోహర్ సర్య్కూట్లను తాకాయి. అదే విధంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 0.93 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సూచీ 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ మరోవైపు సెన్సెక్స్ 257 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్ల చొప్పున రాణించడం విశేషం.
అదానీకి వాటాలను విక్రయించం : ఎన్డీటీవీ ప్రమోటర్లు
న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)లో ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రయివేటు లిమిటెడ్ (ఆర్‌ఆర్‌పిఆర్‌హెచ్)కు ఉన్న వాటాలను విశ్వప్రదాన్ ప్రయివేటు లిమిటెడ్ (విసిపిఎల్)కు బదిలీ చేయాలని వచ్చిన నోటీసులపై ఎన్డీటీవీ ఘాటుగా స్పందించింది. తమతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే ఈ నోటీసులు ఇవ్వడం దారుణమని పేర్కొంది. 2009-10లో ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రమోటర్లు రాధిక గానీ, ప్రణరు రారులు ఆర్‌ఆర్‌పిఆర్‌హెచ్ నుంచి కొంత మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. దీనికి సమానమయ్యే 29.18 శాతం వాటాలను ఆ సంస్థ కలిగి ఉంది. ఇప్పటికీ ఎన్డిటివి ఈ రుణాలను చెల్లిస్తోంది. కాగా.. అదానీ మీడియా సంస్థ ఎఎంజి మీడియా నెట్వర్క్ లిమిటెడ్ (ఎఎంఎన్‌ఎల్)లో భాగమైన విసిపిఎల్ ఎన్డీటీవీకి అప్పులిచ్చిన సంస్థ నుంచి డైరెక్ట్‌గా ఒప్పందం చేసుకుందని తమకు సోమవారమే తెలిసిందని పేర్కొంది. అదానీ గ్రూపు మరో 26 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నారని వార్తలు వచ్చాయి. కాగా దీనిపై కూడా ఎన్డిటివి స్పందించింది. ఎన్డీటీవీ లో వాటాలా ఉపసంహరణ, యాజమాన్య హక్కుల బదిలీపై ప్రమోటర్లు రాధిక గానీ, ప్రణరు రారు గానీ ఎటువంటి చర్చల్లో పాల్గొనడం లేదని తెలిపింది. తమ సంస్థలు వాటాలు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైందని స్పష్టం చేసింది. ఎన్డీటీవీ ఎప్పుడూ తన కీలక కార్యకలాపాల నిర్వహణలో వెనక్కి తగ్గదని స్పష్టం చేసింది. నమ్మిన జర్నలిజం కోసం గర్వంగా నిలబడుతుందని తెలిపింది.