Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోనే 30,318
- ఈసీఈలో 11,375 సీట్లు ొవెబ్ఆప్షన్ల నమోదు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 2022-23 విద్యాసంవత్సరంలో 65,633 సీట్లున్నాయి. సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోనే 30,318 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసీఈలో 11,375 సీట్లున్నాయి. అయితే ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్లో మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు గందరగోళం నెలకొంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత వెబ్ఆప్షన్ల నమోదు ప్రారంభం కావడం గమనార్హం. దీంతో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నాటికి 51,488 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకున్నారని వివరించారు. 8,409 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఈనెల 29 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 30 వరకు గడువుందని పేర్కొన్నారు. వెబ్ఆప్షన్ల నమోదుకు వచ్చేనెల రెండు వరకు అవకాశముందని వివరించారు. అభ్యర్థులకు పూర్తి సమాచారం https://tseamcet.nic.in వెబ్సైట్లో చూడాలని కోరారు. అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు.