Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబులెన్స్ లేక ఆందోళనకు దిగిన విద్యార్థులు
- అడ్డుకున్న పోలీసులు
- నిర్మల్ ఏరియాస్పత్రికి మృతదేహం తరలింపు
- కేసు దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో మంగళవారం విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం డిచ్పల్లితండాకు చెందిన రాథోడ్ సురేష్ హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు తెలియజేశారు. అందుబాటులో అంబులెన్స్ లేకపోవడంతో విద్యార్థులు త్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను యూనివర్సిటీలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వాహనం అద్దం ధ్వంసమైంది. కాసేపు యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్లే తమ తోటి విద్యార్థి ప్రాణం పోయిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతిచెందాడని విద్యార్థులు ఆరోపించారు. అంబులెన్స్ అందుబాటులో ఉంటే విద్యార్థి బతికేవాడని తెలిపారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ముందస్తుగా యూనివర్సిటీలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గదిని ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ కిరణ్‌కారే పరిశీలించారు. విద్యార్థి వాడిన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాలంటే.. మొబైల్ ఫోన్ డాటా పరిశీలించాలన్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. విద్యార్థి మృతదేహాన్ని చూసేందుకు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. బాసర ఆర్జీయూకేటీకి చేరుకున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా విద్యార్థి సంఘాలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.