Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్శిటీ నిధులు పది కోట్లు దుబారా?
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ యూనివర్శిటీ ఖజానా ఖాళీ అయ్యిందా? సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు నిధులలేమి నెలకొందా? వేతనాల కోసం ఇతర డబ్బులు వినియోగించారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. గడిచిన ఏడు, ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. అవసరాలకన్నా ఎక్కువగా వినియోగించి దుబారా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే వర్శిటీకి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేయొద్దని మాజీ రిజిస్ట్రార్‌పై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆంక్షలు విధించినప్పటికీ.. అవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వర్సిటీ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్టు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ యూనివర్శిటీ నిధుల ఖర్చు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. నిధుల కటకటతో ఆగస్టు నెల వేతనాలు ఆలస్యంగా చెల్లించినట్టు తెలిసింది. చేసేది లేక అడిట్సెల్లో ఉన్న నిధులను సర్దుబాటు చేసి వేతనాలు చెల్లించినట్టు సమాచారం. ఈ సంవత్సరం ప్రారంభంలో నిధుల మిగులుతో ఉన్న వర్సిటీలో ప్రస్తుతం జీతాలు చెల్లించలేని స్థితికి రావడంపై అటు మాజీ రిజిస్ట్రార్, ఇటు వీసీ నోరుమెదపడం లేదు. అయితే వర్సిటీలో ఇటీవల కాలంలో దుబారా ఖర్చులు ఎక్కువగా చేసినట్టు ఇతర ప్రొఫెసర్లు వాపోతున్నారు. అయితే ఖర్చుకు సంబంధించి రూ.10 కోట్ల నిధులతో ఏమేమి ఖర్చు చేశారు? ఎంత వెచ్చించారు? అన్న అంశాలపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్రైమాసికానికి నిధులు విడుదల కావాల్సి ఉంది. ఆ నిధుల కోసం సైతం వర్శిటీ నుంచి ప్రయత్నం చేయడం లేదన్న ఆరోపణ ఉంది. ఇటీవల వరకు రిజిస్ట్రార్‌గా కొనసాగిన శివశంకర్‌కు ఈసీ ఆమోదం లేకపోవడంతో సర్కారు నుంచి నిధులు తీసుకురావడంలో వెనుకంజ వేశారన్న ఆరోపణ ఉంది.
వీసీ మౌనమెందుకు?
వర్సిటీలో నిధుల దుబారాపై వీసీ మౌనం వహిస్తున్నారు. ఇంత పెద్దఎత్తున నిధులు వినియోగం జరిగితే వీసీకి తెలీదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేశ తెలిసినా అడ్డుకోలేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ ఉన్నప్పటికీ ఏ విధంగా చేశారన్నది అంతుపట్టడం లేదు.