Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేలని జలవివాదాలు, అనుమతులు
- ఏపీ సర్కార్‌పై రాష్ట్రం అసహనం
నవతెలంగాన ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) బోర్డు పర్యవేక్షణలో పనిచేసే నదీ నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం మరోసారి వాయిదా పడింది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈమేరకు ఏపీ సాగునీటి శాఖ కేఆర్ఎంబీని కోరడంతో మంగళవారం జరగాల్సిన ఆర్ఎంసీ భేటి రద్దయింది. దీంతో తెలంగాణ సాగునీటిశాఖ అధికారులు ఆందోళన, అసహనం వ్యక్తం చేశారు. పదే పదే ఆర్ఎంసీ బేటీలు వాయిదాపడుతున్న నేపథ్యంలో జలవివాదాలు, ఆయా ప్రాజెక్టులకు అనుమతులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటున్నట్టు విమర్శిస్తున్నారు. కేంద్ర సైతం ఏపీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర జలశక్తిశాఖ నిర్ణయాలతోపాటు బోర్డులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రానికి జలాల పంపిణీ, ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు రావడంలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నదని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయపరమైన అంశాలు ముందుకొచ్చి తెలంగాణ పట్ల మోడీ సర్కారు వివక్ష చూపుతున్నదనే వ్యాఖ్యానాలు ఇప్పటికే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సమర్పించినా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) నెలల తరబడి ఆలస్యం చేస్తున్నది. అలాగే నికర జలాలు, వరద జలాలపై పంపిణీ వివాదాన్ని కూడా తేల్చాల్సి ఉంది. అయితే వీటిపై అటు కేంద్ర జల సంఘం గానీ, ఇటు కేఆర్ఎంబీ కానీ సమస్య పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. నిజానికి పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు గత జనవరి రెండోవారంలోగానే కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కానీ, వాటినీ పెండింగ్‌లో పెట్టింది. గత ఏడాది జులై 15లోగా పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు తీసుకోవాలని చెప్పింది కూడా కేంద్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకు చనాఖా, కోరటా, చౌటుపల్లి హనుమంత
రెడ్డి, చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ అనుమతించింది. వీటిని గోదావరి నీదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిశీలన తర్వాత సాంకేతిక అనుమతుల కోసం రాష్ట్ర సాగునీటి శాఖ వేచిచూస్తున్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాతే ఈ ప్రాజెక్టుకు సాంకేతిక క్లియ రన్స్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సీతారామ, తూపాకులగూడెం, మొండి కుంటవాగు డీపీఆర్‌లకు కదలిక రాలేదు. గత మూడు, నాలుగు నెలలుగా ఇది పెండింగ్ పెట్టింది. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో సందర్భానుసారంగా ఏ మేర నీటి నిల్వలు ఉండాలనే విషయమై తేల్చే రూల్‌కర్వ్‌ను నిర్ణయించడానికి ఆర్ఎంసీ భేటి జరగాల్సి ఉంది. దీనిని మరోసారి వాయిదా వేయడంతో తెలంగాణ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జలవివాదాలను పరిష్కరిం చడంలో అటు కేంద్ర జలశక్తిశాఖకు, ఇటు బోర్డు లకు చిత్తశుద్ది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.