Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజంలో సగభాగమున్న మహిళలకు కేంద్రం మొండి చేయి
- మహిళాలోకం పక్షాన నిరంతర ఉద్యమాలు:
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సమాజంలో సగభాగమున్న మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడంలో ఆటంకాలేంటని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో కె.నాగరాణి అధ్యక్షత నిర్వహించిన ఐద్వా సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. నేటికీ వివక్షతకు గురవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉప్పు, పప్పు, కారం, పాలు, పెరుగు ఇలా నిత్యావసర సరుకులు అన్నింటిపైనా జీఎస్టీ వేసి పేదలపై తీవ్ర భారాలు మోపుతోందన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని సాక్ష్యాత్తు ఓ కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించడం ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న భావన ఏంటో అర్థం అవుతుందన్నారు. ప్రేమ పేరుతో గొంతు కోస్తున్న ప్రేమోన్మాదులు, అదే ప్రేమపేరుతో మోసం చేస్తున్న వారు, అదనపు కట్నం కోసం గృహహింసకు గురి చేస్తున్న వారు ఇప్పటికీ కోకొల్లలుగా ఉండటం మహిళల పట్ల సమాజంలో ఏస్థాయిలో వివక్ష రూపాలు ఉన్నాయో అద్దం పడుతోందన్నారు. మహిళల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు, ఇతర వ్యతిరేక విధానాలపై ఐద్వా నిరంతరం పోరాడుతోందని గుర్తు చేశారు. మహిళలపై ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ అన్యాయానికి గురైనా ఐద్వా ముందుండి పోరాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందని చెప్పారు. మహిళాలోకానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఐద్వా ఉద్యమాలకు మద్దతుగా మహిళలు పెద్దఎత్తున ముందుకు రావాలని కోరారు. సమావేశంలో ఐద్వా నాయకులు కృష్ణవేణి, పూజ, యమునా, సంధ్య, భవాని, యం.లావణ్య, అన్నపూర్ణ, జరీనాబేగం, శారద, లక్ష్మి, రజిత, రాజకుమారి, ప్రమీల, సుజాత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.