Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరీక్షా పత్రాల్లో మార్పులు చేయాలనీ, నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని డిమాండ్ చేస్తూఎంబీబీఎస్ విద్యార్థులు చేస్తున్న నిరసనకు ప్రయివేటు లెక్చరర్ల సంఘం మద్ధతు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రయివేటు లెక్చరర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఎ.విజయకుమార్, యువజన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ గత నెలలో జరిగిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేల్లో ఏ కేటగిరీ విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఇందుకు కాళోజీ యూనివర్సిటీ అధికారుల వాల్యుయేషన్ లోపమే కారణమని విమర్శించారు. పరీక్ష నిర్వహణ, వాల్యూయేషన్లో అధికారుల తప్పిదమని ఆరోపించారు. వెంటనే రీ వాల్యుయేషన్ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పరీక్ష పాటర్న్లో 12 ప్రశ్నలు అడిగే వారని, సమాధానాలు రాసేందుకు సమయం రెండున్నర గంటలు ఉండేదనీ, దీనివల్ల సమయం సరిపోయేదని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలో 20 ప్రశ్నలు అడిగి సమయం మూడు గంటలు మాత్రమే ఇస్తుండటంతో అది సరిపోవడం లేదన్నారు. అందుకే ప్రశ్నలు తక్కువ అడగాలని సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం 20 మార్కుల మేర మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రతిభావంతులైన విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే చదువులకే దూరమయ్యే ప్రమాదముందనీ, యూనివర్సిటీ వీసీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.