Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో పాలడుగు చిన్న వెంకయ్య మృతి
- నిబద్ధత కలిగిన నాయకుడు చిన్న వెంకయ్య :
సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-గార్ల
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తండ్రి పాలడుగు చిన్న వెంకయ్య మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రం ఇందిరానగర్ కాలనీకి చెందిన పాలడుగు చిన్న వెంకయ్య(74) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పట్ల, కమ్యూనిస్టు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు పాలడుగు చిన్న వెంకయ్య అని తెలిపారు. పేద దళిత కుటుంబానికి చెందిన వెంకయ్య ఎన్నో అవాంతరాలు, అటంకాలు ఎదుర్కొని మంగపతిరావు, సత్తార్ మియా తదితర నాయకులకు అండగా నిలిచి వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడంలో ముందు వరుసన నిలబడేవారని ఆయన సేవలను కొనియాడారు. పేదరికం అనుభవిస్తూనే కుటుంబంలో తన కుమారులను చదివించడం అభినందనీయమన్నారు. వెంకయ్య పెద్ద కుమారుడు నేడు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎదిగేందుకు వెంకయ్య కృషి, ప్రోత్సాహం వెలకట్టలేనిదన్నారు. ఆయన చనిపోయినా మరొకరికి చూపు ఇచ్చేందుకు వెంకయ్య నేత్రాలను దానం చేయడం అభినందనీయమని తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలిపారు. సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, పోతినేని సుదర్శన్ రావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి సోమయ్య, నున్నా నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వంగూరి రాములు, రాజారావు, భూపాల్, కళ్యాణం వెంకటేశ్వర్లు, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఏవీ నాగేశ్వరరావు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సురేష్, మానుకోట, ఉమ్మడి ఖమ్మం జిల్లాల సీపీఐ(ఎం), సీఐటీయూ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొని ఘన నివాళులర్పించారు. కాగా, అనారోగ్యంతో మతి చెందిన పాలడుగు వెంకయ్య అంత్యక్రియలు సనాతన సంప్రదాయలకు భిన్నంగా అభ్యుదయ భావాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు నిర్వహించారు.
సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకుల సంతాపం
పాలడుగు భాస్కర్ తండ్రి మరణ వార్త తెలుసుకున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, అఖిల భారత సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తపన్‌సేన్, అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత, ఉపాధ్యక్షులు యం. సాయిబాబు, అఖిలభారత జాతీయ కార్యదర్శి బి వెంకట్, సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్, కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, బాలకాశీ, బేబి రాణి, వి.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు హిమబిందు, ఎంవీ రమణ, జగ్గు నాయుడు తదితరులు భాస్కర్‌ను ఫోన్ లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా భాస్కర్ ను ఫోన్ లో పరామర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు, సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, వివిధ జిల్లాల పార్టీల నాయకులు తదితరులు పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.