Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్వని, వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
నవతెలంగాణ-కోదాడరూరల్
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామస్తు లు తమ గ్రామశివారులో ఉన్న మిడ్వెస్ట్ గ్రానైట్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీ వల్ల ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యంతో భయ భ్రాంతులకు గురవుతున్నామన్నారు. ప్రతిక్షణం భయంతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన వ్యర్థపదార్థాలతో వర్షాలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బంది అవుతోందని చెప్పారు. ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నా కనీసం గ్రామం లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఎన్ఓసీ గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, పర్మిషన్ లేకుండా గ్రానైట్ నడుపుతున్నారన్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ అధికారుల నుంచి సమాధానం లేదన్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ చెప్పారు.