Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
తాము సాగుచేసుకుంటున్న భూములు తమకే ఇప్పించి న్యాయం చేయాలని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్కు చెందిన కొంతమంది దళిత మహిళా రైతులు మంగళవారం అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ కోట దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ.. దౌలత్‌నగర్ గ్రామ ఎస్సీ మాదిగ కుల నిరుపేదలమైన తాము కొన్నేండ్లుగా దినసరి కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. మా పేదరికాన్ని గమనించి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1999-2000 సంవత్సరంలో భూమిలేని ఎస్సీ కూలీలకు పర్వతగిరి శివారులోని సర్వే నంబర్ 81,480, 499, 500, 501, 502, 503, 515, 516, 501/ఏ, 516/ఏ లోని 40 ఎకరాల వ్యవసాయ భూమిని 40 మంది పేద మహిళా రైతులకు ఎకరాకు రూ. 75,000 వ్యవసాయ నిమిత్తం ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసి సంబంధిత రైతుల నుంచి భూమి 40 ఎకరాలు కొనుగోలు చేసింది. 2001లో తమకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించారని తెలిపారు. అనంతరం 2001 నుంచి 2004 వరకు భూమి సాగుచేసుకున్నామన్నారు. 2005లో పర్వతగిరికి చెందిన అగ్రకుల వ్యాపారవేత్త చింతపట్ల శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది తమ వ్యవసాయ భూములను కాజేయాలని దురుద్దేశంతో తమ భూమిలో బోరు బావులు తవ్వి సేద్యంకు ఉపయోగపడే విధంగా ఆరేండ్లకు కౌలుకు తీసుకున్నారని, మా నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని కౌలు పేరుతో వేలిముద్రలు తీసుకుని పట్టా పాస్‌పుస్తకాలు వారి ఆధీనంలో ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారి మాటల ప్రకారం ఆరేండ్ల అనంతరం మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి సంబంధిత ధ్రువపత్రాలు వచ్చిన తర్వాత తమ భూములు స్వాధీనపరచుకొని వ్యవసాయం చేసుకొనేందుకు వెళ్లగా సదరు వ్యక్తులు మాపై దౌర్జన్యం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ వ్యవసాయ భూమిని కౌలు పేరుతో మోసం చేసి భూ కబ్జా చేసిన చింతపట్ల శ్రీనివాసరావు, ఆయనకు సహకరించిన వారిపై అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించామని తెలిపారు.
ఈ నేపథ్యంలో దళిత మహిళా రైతులు మాట్లాడుతూ.. తమకు భూములు తప్ప జీవనోపాధి లేదని, భూమిని నమ్ముకొని జీవిస్తున్నామని, తమ భూములను తమకు అప్పగించి న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ పేద మహిళ రైతుల భూములను అక్రమంగా కబ్జా చేసి లీజుకు తీసుకున్న వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. కార్యక్రమంలో దళిత మహిళ రైతులు తదితరులున్నారు.