Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై పెరుగుతున్న దాడులు: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
- హైదరాబాద్‌లోని ఎస్వీకే వద్ద కేవీపీఎస్ నిరసన
నవతెలంగాణ-ముషీరాబాద్
బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దళితులకు రక్షణ పూర్తిగా కరువైందని, మంచినీళ్ల కుండను ముట్టుకున్నాడని రాజస్థాన్‌లో తొమ్మిదేండ్ల దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మేగ్వాల్ను ఓ టీచర్ కొట్టి చంపారని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లు తాగితే మట్టుబెడతారా?.. కుల దురహంకార హత్యలు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ టీచర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. రాజస్థాన్‌లో దళిత విద్యార్థి హత్య ఘటనపై బుధవారం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. కుల, మతోన్మాదం వంటి దుర్మార్గాలు నేటికీ కొనసాగడం సిగ్గుచేటన్నారు. కేంద్రలోని బీజేపీది దళిత వ్యతిరేక పాలన అని మరోసారి రుజువైందన్నారు. ఉన్నత కులాల ఉపాధ్యాయుల కోసం కేటాయించిన కుండలోని నీటిని తొమ్మిదేండ్ల ఇంద్ర మేఘ్వాల్ తాగినందుకు టీఆచర్ కొట్టడంతో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భారతీయ విద్యా వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా మనువాద, ఛాందస భావాలతో నిండి ఉందన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు సామాజిక రుగ్మతల నుంచి విముక్తి కలిగించే చర్యలు చేపట్టడం లేదన్నారు. రాజస్థాన్‌లో జరిగిన సంఘటన కులతత్వానికి, అంటరానితనానికి మరో ఉదాహరణ తప్ప మరొకటి కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా, దళితులు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలు స్వేచ్ఛను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజస్థాన్ జిల్లాలో దళిత మహిళా టీచర్ పాఠశాలకు వెళ్తుండగా కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంఘటన కూడా జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు దేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా దళితుడి ఇంట్లో భోజనం చేశానని ఫోజులు ఇస్తారు కానీ దళితులపై అమానుష దాడులపై స్పందించరని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నగర నాయకులు ఎం.దశరథ్, సీనియర్ వాగ్గేయకారులు జగన్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేశ్, ఎ.వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, బొప్పని పద్మ, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కోట గోపి, మంద సంపత్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎం.చుక్కయ్య కేవీపీఎస్ నగర అధ్యక్షులు టి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.