Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి.. ఆరుగురికి గాయాలు
- నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ప్రమాదం
నవతెలంగాణ - చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గల ఇండీస్ ల్యాబొరేటరీలో బుధవారం రియాక్టర్ పేలింది. ఇందులో ఒకరు మృతిచెందారు. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రియాక్టర్పై ఒత్తిడి ఎక్కువై భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. కార్మికులు లబోదిబోమంటూ బయటికి పరిగెత్తారు. గాయపడిన కార్మికుల్లో ముగ్గురిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వారిలో కడప జిల్లాకు చెందిన ప్లాంటు మేనేజర్ లక్ష్మారెడ్డి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శుభం, ఎండి.వహీద్, మోహన్, బల్దేవ్, రాజ్ కుమార్, మరో కార్మికుడు ఉన్నారు. వీరిలో బల్దేవ్(35) శరీరం పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రియాక్టర్ పేలుడు వల్ల ఆ ప్రాంతమంతా కెమికల్ వాసనతో నిండిపోయింది.
ఘటనపై నల్లగొండ ఆర్డీవో జగన్నాథం మాట్లాడుతూ.. డీ బ్లాక్లో ఎనిమిది మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మరో ముగ్గురు కార్మికులను కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు.