Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన విద్యావిధానంతో మహిళలు విద్యకు దూరం
- ఎన్ఈపీతో డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం
- సెమినార్లో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగంలో అసమానతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు విపి సాను విమర్శించారు. కేంద్రం తెస్తున్న నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)తో మహిళలు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఈపీ అమల్లోకి వస్తే డ్రాపౌట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్‌లో ఇందిరా ప్రియదర్శిని మహిళా కళాశాలలో బుధవారం 'నూతన విద్యా విధానం - మహిళల విద్య' అనే అంశంపై ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా విపి సాను మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే విద్యారంగంలో అసమానతలు పెరిగాయనీ, ఎన్ఈపీ అమలుతో అది తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు విలీనమై మహిళల విద్య కుంటుపడుతుందన్నారు. ఇప్పటికే దేశంలో మహిళ అక్షరాస్యత 40 శాతం ఉంటే ఎన్ఈపీ అమలుతో అది మరింత వెనక్కి వెళ్తుందని అన్నారు. మహిళలకు భద్రత కరువైందనీ, గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను విడుదల చేయడాన్ని బీజేపీ ఏ విధంగా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. దేశంలో మహిళల విద్యకు నిధులు కేటాయించాలనీ, ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థినీలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయానికి నిధులిచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్గువేరా, ఉపాధ్యక్షులు సునీల్, అనూష, జిల్లా కమిటీ సభ్యులు అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.