Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లిపట్టు నాగరాజుకు యువ పురస్కారం
- నవంబరు 14న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం
న్యూఢిల్లీ/కరీంనగర్ప్రాంతీయ ప్రతినిధి
ప్రముఖ కవి, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ -2022 బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. యువ కవి, ఉపాధ్యాయుడు పల్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికయ్యారు. పత్తిపాక మోహన్ ''బాలల తాతా బాపూజీ''కవితా సంకలనాలు అకాడమీ -2022 బాల సాహిత్య పురస్కారం,పల్లిపట్టు నాగరాజు ''యాలై పూడ్చింది'' యువ పురస్కారాలకు ఎంపికయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా నేతృత్వంలో బుధవారం నాడిక్కడ సమావేశమైన ఆకాడమీ సభ్యులు 22 భాషలకు సంబంధించి జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన రచనలకు పురస్కారాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడిన కవితా సంపుటాలు, చిన్న కథలు, నవలలు, జ్ఞాపకాలు, యాత్రా సాహిత్యం, వ్యాస సంపుటాలు, వ్యంగ్య రచనలకు బాల, యువ పురస్కారాలను వెల్లడించారు. ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార్‌కు పంజాబీ రచన ఏదీ ఎంపిక కాలేదు. బాల పురస్కారంలో సంతాళి, యువ పురస్కారంలో మరాఠీ రచనలకు కొద్ది రోజుల తరువాత పురస్కారాలు ప్రకటిస్తామని అకాడమీ తెలిపింది. బాల, యువ పురస్కారాలకు ఎంపికైన కవులు, రచయితలకు నవంబరు 14న ఢిల్లీలో నిర్వహించే సమావేశంలో అవార్డులను ప్రధానోత్సవం చేస్తారు. దీని కింద రూ.50 వేల నగదు చెక్కు, తామ్ర పత్రం అందజేస్తారు.
పత్తిపాక మోహన్ జీవిత నేపథ్యం
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పత్తిపాక మోహన్ 1972 జనవరి 5న చందుర్తి మండలం లింగంపేటలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ఎంఎ, పిహెచ్డి చేశారు. 'తెలుగులో గజల్ ప్రక్రియ-సమగ్ర పరిశీలన' పేరుతో తెలుగు గజల్‌పై తొలి పరిశోధన చేశారు. 1997లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మొదటి యువ విశిష్ట సాహిత్య పురస్కారంతో పాటు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాహిత్య పురస్కారం-2017 వంటి ఎన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు.
యువ కవి నాగరాజు జీవిత నేపథ్యం
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రంగనాధపురం మిట్టిండ్లు గ్రామంలో 1987 మే 22న నాగరాజు జన్మించారు. తల్లిదండ్రులు పల్లిపట్టు భూలక్ష్మి, రాఘవయ్య. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు) చదివిన నాగరాజు 2016లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలం 64 పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. రెక్కలు (మినీ కవితలు), మమ్మీ అమ్మ కావాలి, మనసుపొరల్లో వంటి నాలుగు కథలు, పలు కవితలను నాగరాజు రాశారు. ఆయన కవితలు కన్నడ, ఇంగ్తీషు భాషల్లోకి ఎక్కువగా అనువాదమయ్యాయి.
పత్తిపాక మోహన్‌కు బాలసాహిత్య పురస్కారం పట్ల సీఎం హర్షం
'కేంద్ర సాహిత్య అకాడమీ, 'బాలసాహిత్య పురస్కారా(2022)నికి' డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన రాసిన 'బాలల తాత బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కడం గొప్ప విషయమని సీఎం తెలిపారు. గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికి తెలంగాణ సాహితీవేత్తకు ఈ పురస్కారం దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందని పేర్కొన్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డి శిష్యుడైన సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన వారని తెలిపారు. ఆయన సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం ఆకాంక్షించారు.