Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లివ్వాలి..
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
గంగా నది ప్రక్షాళన కోసం రూ.20వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. మూసీ ప్రక్షాళన కోసం కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. మూసీని జల కాలుష్యం నుంచి ప్రక్షాళన చేయాలని, మూసీ ఆయకట్టు ప్రాంతంలో గోదావరి, కృష్ణా జలాలు అందించాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుయాత్ర బుధవారం చౌటుప్పల్ మండలంలోని మసీద్గూడెంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. మూసీ జల కాలుష్యంతో ప్రజలతోపాటు అన్ని రకాల జీవరాశులు విషపు కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మూసీ జల కాలుష్య నివారణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలన్నారు. వరిపంట పూర్తిగా విషపూరితంగా మారి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ అధినాయకత్వం రాజాసింగ్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి రావాలని డిమాండ్ చేశారు. మూసీ నీరు మురికికూపంగా మారడానికి పాలకుల విధానాలే కారణమన్నారు. అనేక సంవత్సరాల నుంచి మూసీ ప్రక్షాళన చేయాలని పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం 60 నుంచి 70శాతం, రాష్ట్రం 30శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.