Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ యాత్రకు పర్మిషన్ ఇవ్వొద్దు
- హైకోర్టులో ప్రభుత్వ వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతి లేనప్పుడు అంత మంది జనంతో యాత్రకు ఎలా అనుమతించారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. యాత్రకు పోలీసుల నుంచి రాతపూర్వకంగా అనుమతి లేదని బీజేపీ కూడా ఒప్పకుంటోందనీ, ప్రభుత్వం కూడా అనుమతి లేదని చెబుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో యాత్ర అంశం జోలికి తాము వెళ్లబోమని తేల్చి చెప్పింది. బండి సంజరు తన యాత్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగాలు చేశారనే వీడియోలు, యాత్ర నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను గురువారం జరిగే విచారణ సమయంలోగా అందజేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజరు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేస్తూ వర్దన్నపేట ఏసీపీ ఈ నెల 23న ఇచ్చిన నోటీసును కొట్టేయాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం విచారించారు. రెండు విడతల యాత్ర జరిగిపోయింది. ఈ నెల 27తో మూడో విడత పూర్తవుతుంది. ఈ దశలో పోలీసులు యాత్రను అన్యాయంగా అడ్డుకున్నారనీ, వారిచ్చిన నోటీసును రద్దు చేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వాదించారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా బండి సంజరు ప్రసంగాలు ఉంటున్నాయనీ, యాత్రకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి కోరారు. పోలీసుల అనుమతి లేకుండానే యాత్ర జరుగుతోందన్నారు. సంజరు ప్రసంగాల వీడియోలు ఉన్నాయనీ, పోలీసులు కూడా పలు కేసులు నమోదు చేశారని తెలిపారు. ఆ వివరాలను అందజేస్తే గురువారం విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి తెలిపారు.