Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో కలెక్టరేట్ల ఎదుట వీఆర్ఏలు తలపెట్టిన మహాధర్నా-వంటావార్పునకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలుపుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్వేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బొప్పిని పద్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివబాబు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ హామీనిచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, అర్హులకు ప్రమోషన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నెల నుంచి సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పెరిగిన నిత్యావసరాలు, ఇతర ఖర్చుల నేపథ్యంలో వీఆర్ఏలు రూ.10, 500 వేతనంతో ఎలా బతకాలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. వీఆర్ఏలకు పీఆర్సీ ఎందుకు వర్తింపజేయబోరని నిలదీశారు. క్షేత్రస్థాయిలో గొడ్డుచాకిరీ చేస్తున్న వీఆర్ఏలు జీతం కోసం కొట్లాడాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకురావడం సరిగాదన్నారు. సుప్రీం కోర్టు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చెప్పినా పట్టదా? అని ప్రశ్నించారు. వీఆర్ఏలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.