Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం కోసం.. ధర్మం కోసమంటూ అందమైన నినాదాలు
- సమస్యలు, భారాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే...
- బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశం కోసం.. ధర్మం కోసమంటూ అందమైన నినాదాలు వల్లె వేస్తోన్న ఆ పార్టీ అసలు స్వరూపం... 'ద్వేషం కోసం.. అధర్మం కోసం...' అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మండిపోతున్న పెట్రోల్ ధరలు, నిత్యావసరాల భారాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆ పార్టీ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊడిపోతున్న ఉద్యోగాల గురించి జనం ఆలోచించకుండా ఉండేందుకే ఇలాంటి చర్యలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో వారు విష ప్రచారాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ (భిన్నత్వంలో ఏకత్వం)ను దెబ్బ తీసేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 'మిత్రులారా... మనకు ద్వేషం కాదు.. దేశం ముఖ్యం...' అంటూ ప్రజలకు సూచించారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమంటూ కేటీఆర్ పేర్కొన్నారు.