Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?
- కేంద్ర నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణ ఎడారి
- మేధావులు, బుద్ధిజీవులు, యువకులు నిర్లక్ష్యం వీడాలి:
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మతోన్మాదులతో దేశానికి భవిష్యత్ ఉండదని, పచ్చటి తెలంగాణలో మంటలేపుతున్న ఇలాంటి మత, కుల పిచ్చిగాళ్ల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. మత పిచ్చిగాళ్లు వచ్చి పచ్చటి పంటలతో ఉన్న తెలంగాణను.. మంటల తెలంగాణగా మార్చితే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. 58 ఏండ్లు తిప్పలు పడ్డామని, మళ్లీ రాష్రానికి అలాంటి తిప్పలు రాకుండా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని గురువారం సీఎం ప్రారంభించారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్నీ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలతో కూల్చివేసిందన్నారు. ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మమత, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాలను కూల్చివేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా? రాజకీయమా? అరాచకత్వమా? సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఉజ్వలమైన పోరాటం చేయాలన్నారు. ఈ పోరాటంలో ముందు వరుసలో తాను ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో కరెంట్ లేదని, ఎనిమిదేండ్లలో నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు సిపాయిలంత గొప్పవారైతే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నాణ్యమైన ఉచిత కరెంట్‌ను 24 గంటల పాటు ఎందుకు సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో 70 టీఎంసీల నీళ్లు వృథాగా పోతుంటే సాగు, తాగు నీరు ఎందుకివ్వడం లేదన్నారు. ఐటీ రంగంలో బెంగళూర్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని, కానీ ఏడాది కాలంగా రెండో స్థానంలో ఉందన్నారు. దీనికి కారణం అక్కడి బీజేపీ ప్రభుత్వం హిజాబ్, హలాల్ అంటూ మత విద్వేశాలు రెచ్చగొట్టడమేనని తెలిపారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రానివ్వబోమని స్పష్టం చేశారు. తన బలం, బలహీనతలు ప్రజలేనని ఉత్తేజపరిచారు. పంటలు పండే తెలంగాణ కావాలా..? మత పిచ్చితో చెలరేగే మంటల తెలంగాణ కావాలా అంటూ ప్రజలను పలుమార్లు అడిగారు. దీనికి ప్రజలు స్పందిస్తూ పంటలు పండే తెలంగాణ కావాలంటూ నినాదించారు. బుద్ధి జీవులు, మేధావులు, యువకులు, మహిళలు నిర్లక్ష్యాన్ని వీడి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించే విధానాలపై ఊరూరా చర్చ పెట్టాలన్నారు. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే.. మన ముందు ఉన్న కర్తవ్యాన్ని పిడికిలెత్తి పోరాడి సాధించాలన్నారు.
కేంద్ర నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణ ఎడారి
బీజేపీ నిర్లక్ష్యంతోనే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు అందాల్సిన సాగు నీటిని సరఫరా చేయలేకపోతున్నామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేంద్రానికి వందల సార్లు దరఖాస్తులు ఇచ్చామని, చివరికి సుప్రీంకోర్టులో కేసు వేశామన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలకు అభివృద్ధి కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.10కోట్ల చొప్పున ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అమరుకుమార్, తదితరులు పాల్గొన్నారు.