Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలిచ్చిన స్థలాల్లో గుడిసెలు వేయకుండా అరెస్ట్
- తెల్లవారుజామునే సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్
- పోలీసు స్టేషన్లో మహిళల నిరసన
- ఇండ్ల స్థలాల సాధన దీక్షల భగ్నానికి కుట్ర
- ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ - బల్మూరు
పేదలకు పట్టాలిచ్చిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అక్కడ గుడిసెలు వేసేందుకు సిద్ధమైన సీపీఐ(ఎం) నాయకులు, లబ్దిదారుల ఇండ్లను పోలీసులు తెల్లవారుజామునే చుట్టుముట్టారు. ఇంటింటికీ వెళ్లి వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. దాంతో స్టేషన్లో, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో గురువారం జరిగింది.
గతంలో పట్టాలిచ్చిన స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో గురువారం గుడిసెలు వేసేందుకు పిలుపునివ్వగా తెల్లవారుజామున నాలుగ్గంటలకే పోలీసులు నేతలను, పేదలను అరెస్టు చేశారు. పోలీసులకు రాత్రే విషయం తెలియడంతో తెల్లవారుజామునే అరెస్టులు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో మహిళలు, నేతలు స్టేషన్లోనే పెద్దఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని శాంతియుతంగా చేస్తున్న రిలే దీక్షలను భగం చేసేందుకే పాలకులు పోలీసులను ఉపయోగిం చారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 26 గోదాల్ రోడ్డు వైపున ఉన్న ఐదెకరాల 20 గుంటల భూమి కోసం సీపీఐ(ఎం) పోరాటం చేయగా అప్పటి ప్రభుత్వం 114 మంది పేదలకు ఇండ్ల స్థలాల కోసం 2012లో పట్టాలిచ్చిందన్నారు. ఆ భూమిలో లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి వెళితే.. ఆ పట్టాలను రద్దు చేశామని చెప్పి కట్టిన బేస్మెంట్లు, గుడిసెలను అధికారులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల పట్టాలున్న పేదలు ఇండ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలని 2018లో తమ పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రాలిచ్చి.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టామని గుర్తు చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టామన్నారు. అప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో పట్టాలిచ్చిన భూమిలో అర్హులైన పేదలతో గుడిసెలు వేయించాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే, గుడిసెలు వేయడానికి ముందే పోలీసులు ఇంటింటికీ వెళ్లి నాయకులను, పేదలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నిసార్లు తమను నిర్బంధించినా పేదలకు ఇండ్ల స్థలాలు సాధించే వరకూ పోరాటాలు చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాల్సిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మౌనం వహించడం సరికాదన్నారు. పట్టాల కోసం భవిష్యత్లో మండల కేంద్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. అప్పటికీ స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
అంతకు ముందు లబ్దిదారులు రోడ్డుపై బైటాయించగా అరెస్టు చేసి లింగాల పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టైన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎల్.దేశ్య నాయక్, నాయకులు మల్లేష్, అశోక్, మండల కార్యదర్శి శంకర్ నాయక్, నాయకులు మహేందర్, భాస్కర్, సీనియర్ నాయకులు బాలీశ్వరయ్య, సత్యం, లక్ష్మయ్య, లబ్దిదారులున్నారు.