Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమి అధ్యక్షులు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మత విధ్వం సాలను సృష్టించేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాలను అభ్యుదయ కవులు, రచయిత లందరూ తిప్పి కొట్టాలని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మట్టి మతసామరస్యనికి ప్రతీక అని ఆయన అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మఖ్దూం మొహియుద్దీన్ 53వ వర్థంతిని గురువారం హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌పై గల ఆయన విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మఖ్దూం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జూలూరి మాట్లాడుతూ రాష్ట్రంలో మతసామరస్యాన్ని రక్షించడానికి, అందరిలో లౌకికభావాలు నాటడానికి, మనిషిని మనిషి ప్రేమించే సమాజం కోసం ఈ నేలపై ఎందరో త్యాగాలు చేశారని చెప్పారు. అలాంటి లౌకిక భావాలు, గంగ యమున తెహజీబ్ లాంటి సంస్కృతిని విధ్వంసం చేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో మఖ్దూం లాంటి కవులు రాసిన రచనలు, అలాంటి యోధులు ప్రజలందర్నీ జాగృతం చేసినట్టుగానే నేడు ఆ ప్రగతిశీల భావాలను పుణికిపుచ్చుకోవాలని సూచించారు. ఆయన చూపిన బాటలో నడవాల్సిన అవసరముందన్నారు. గతం కంటే ఎక్కువగా నేడు నడుం బిగించాలని అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి మాట్లాడుతూ మఖ్దూం కులమతలాలకు అతీతంగా రచనలు చేసి ఈ నేల కోసం పోరాడిన వ్యక్తి అని చెప్పారు. ఆయనను స్మరించుకోవడమంటే నేడు ఈ రాష్ట్రానికి ఎదురవుతున్న అనేక సవాళ్లకు సమాధానం తెలుసుకోవడమేనని అన్నారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఈ సమస్త తెలంగాణ మట్టిని సమున్నతంగా, సమైక్యంగా, సమానతతో నిలుపుకోవాల్సిన అవసరముందని సూచించారు. కులతత్వశక్తులకు, మతతత్వశక్తులకు Aవ్యతరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, సలీమ, అనంతోజు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.