Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టుల ఇండ్లస్దలాలు, ఇండ్లనిర్మాణ సమస్యపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తెలంగాణ జర్నలిస్టుల విజయమనీ, ఫెడరేషన్ చేసిన పోరాట ఫలితమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య చెప్పారు. దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇండ్లస్థలాల సమస్యపై టీడబ్ల్యూజేఎఫ్ అనేక పోరాటాలు చేసిందనీ, పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించడంతో పాటు మూడు సార్లు రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఇకపోతే గత ఏడాది జూన్ 15న ఫెడరేషన్ ప్రతినిధి బందం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను రాజ్‌భవన్‌లో కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చామన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేసును పరిశీలించి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని జస్టీస్ ఎన్వీ రమణ తమకిచ్చిన హామీని నెరవేర్చారని అభినందించారు. ఈ సందర్భంగా జస్టీస్ ఎన్వీ రమణకు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున, యావత్ తెలంగాణ జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే గత రెండేండ్లుగా నిలిపేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసుల విషయంలో కూడా టీడబ్ల్యూజేఎఫ్ చాలాసార్లు కేంద్ర మంత్రులకు, రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించి రైల్వే పాస్‌ల పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. 2014లో ఫెడరేషన్ పోరాటం అనంతరమే తెలంగాణ పేరుతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జర్నలిస్టులకు ఇండ్లస్దలాలు కేటాయించాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని, క్యాబినెట్లో ఆమోదించి ఇండ్లనిర్మాణం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.