Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీయాక్టు నమోదు,14 రోజుల రిమాండ్
- చర్లపల్లి జైలుకు తరలింపు
నవతెలంగాణ- సిటీబ్యూరో
వివాదాస్పద, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు గురువారం నోటీసులు అందజేసి షాహినాయత్ గంజ్‌లోని ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. మూడ్రోజుల కిందట మహ్మద్ ప్రవక్తపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 22న రాజాసింగ్ ఓ ఛానల్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి. అతన్ని అరెస్టు చేయాలంటూ కొందరు ఆందోళన చేయడంతోపాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రెండ్రోజుల కిందట అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదంటూ రాజాసింగ్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గురువారం మరోసారి రాజాసింగ్‌కు పలు కేసుల్లో నోటీసులు అందజేసి అరెస్టు చేసిన పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. దీంతో రాజాసింగ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
101 క్రిమినల్ కేసులు
2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులున్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఇదిలావుండగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు గురువారం ఉదయమే రాజాసింగ్‌కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో 505(2), 171, రెడ్‌విత్ 171 సెక్షన్లు , షాహినాయత్‌గంజ్ పీఎస్‌లో క్రైమ్ 71/2022లో 153(ఏ). 295 (ఏ), 504, 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.