Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి కేంద్రం కేవలం 1.1 శాతం మాత్రమే కేటాయించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 4.5 శాతం కేటాయించిందని గుర్తుచేశారు. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) నూతన అకాడమిక్ భవన సముదాయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ ఐఐపీహెచ్కు 45 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రూ.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. వైద్యసేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. 630 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పబ్లిక్ మేనేజ్మెంట్ పర్సన్ నియామకంతో పాటు ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఐఐపీహెచ్ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.