Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులు అర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు
నవతెలంగాణ-బాలానగర్
పేదలు, కార్మికుల సమస్యలపై కార్మిక కామ్రేడ్ తుమ్మల మోహన్రావు తన చివరి శ్వాస వరకు పోరాడారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు అన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్రావు హైదరాబాద్ బాలానగర్ పరిధిలో మదీనగూడలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. మోహన్రావు మృతదేహంపై డిజి.నర్సింహారావు సీపీఐ(ఎం) జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మోహన్రావు అకాల మరణం చాలా బాధాకరం అన్నారు. ఐడీపీఎల్ పరిశ్రమలో రిటైర్మెంట్ అనం తరం కార్మిక ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుని పేద ప్రజల పక్షాన, కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో సీఐటీయూను బలోపేతం చేసేందుకు మోహన్రావు ఎంతో కృషి చేశారన్నారు. బస్తీల్లో రాత్రి పూట చదువుకునే మహిళలకు, బస్తీ వాసులకు చదువు నేర్పారని గుర్తు చేశారు. మోహన్రావు ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, సౌత్ జిల్లా కార్యదర్శి పి.సోమన్న, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శోభన్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కమిటీ సభ్యులు ఐలాపురం రాజశేఖర్, ఎం.శంకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బాలు, సీఐటీయూ నాయకులు ఎం. చంద్రశేఖర్, కృష్ణా నాయక్, ఐడీపీఎల్ నాయకులు శ్యామల, వెంకటనర్సయ్య, వైవి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి, సుధాకర్, రాజు, రాములు తదితరులు జోహార్లు అర్పించారు. మోహన్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.