Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలు వచ్చేనెల నాలుగు నుంచి ఏడో తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో గురువారం మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రవీంద్రచారి విడుదల చేశారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ మహాసభల సందర్బంగా వచ్చేనెల నాలుగున వేలాది మందితో శంషాబాద్ పట్టణంలో భారీ ప్రదర్శన, అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షులుగా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజాన్, పార్లమెంట్ సభ్యులు బినోరు విశ్వమ్ ముఖ్యఅతిథులుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు వక్తలుగా హాజరవుతారని వెల్లడించారు. వచ్చేనెల ఐదున ఉదయం అరుణ పతాక ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు.
అనంతరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మహాసభలను ప్రారంభిస్తారని అన్నారు. ఆరు, ఏడు తేదీల్లో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 800 మంది ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. ఈ మహాసభల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిషత్ కార్యాచరణ, మతోన్మాద శక్తుల ఆగడాలు, కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు ఆమోదిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్‌రావు, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పనుఘంటి పర్వతాలు, ప్రభులింగం, ఎం అదిరెడ్డి, ప్రవీణ్ కుమార్, కె రామస్వామి, ఫామీద, చందు నాయక్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.