Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమార్కుల దౌర్జన్యం
- బోరు వేసి, చదును చేసిన వైనం
- చూసీచూడనట్టుగా రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ- మిర్యాలగూడ
ప్రభుత్వ భూమి కనబడితే చాలు కబ్జా చేసేందుకు అక్రమార్కులు పోటీ పడుతున్నారు.. షుగర్ ఫ్యాక్టరీ భూములనూ వదలడం లేదు. రెవెన్యూ అధికారులు ఇదేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిసరాలు, శివారు ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా అక్రమార్కులు రాబందుల్లా వాలిపోతున్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులు ఉన్నారని తెలిసింది.
152 ఎకరాల్లో షుగర్ ఫ్యాక్టరీ భూములు
ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆలగడప శివారులో 1976లో అమృత్‌నగర్ వద్ద 152 ఎకరాల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పారు. ఆ ఫ్యాక్టరీ 1998 వరకు గడిచింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల లే ఆఫ్ ప్రకటించి తర్వాత మూసేశారు. అప్పటి నుంచి ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. అక్కడ నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. ఆ భూముల నుంచే వ్యవసాయ మార్కెట్‌కు 51.26, మిషన్ భగీరథకు 23.36, గిరిజన గురుకుల పాఠశాలకు 43.23, పాల కేంద్రానికి 1.19, కస్తూరిబా గాంధీ పాఠశాలకు మూడెకరాలు కేటాయించారు. ఇంకా 33.25 ఎకరాల భూమి మిగిలి ఉంది.
ఆ భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నాయకుడు
ఖాళీగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములు మిర్యాలగూడ మండలం అవంతిపురం సమీపంలో ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ మండల నాయకుడు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో రెండు ఎకరాలు కబ్జా చేసినట్టు సమాచారం. తమ పొలానికి ఆనుకొని ఉన్న ఫ్యాక్టరీ భూమిని ఆక్రమించుకొని, బోరు వేసి, చదును చేసి సాగు చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే, ఆ భూములకు ఆనుకొని ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్.. కబ్జా విషయాన్ని గుర్తించి వాట్సాప్ ద్వారా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు స్పందించి ఆ భూములను పరిశీలించి వెళ్లారు. దాంతో అధికార పార్టీ నాయకుడు కాస్త వెనుకంజ వేసినట్టే వేసి.. మళ్లీ ఇప్పుడు ఆ భూమిలోనే బోరు వేసి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం.
కోర్టు తీర్పు ఉన్న కార్మికులకు కేటాయించని భూమి
ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు కార్మికుల కోసం సుమారు 500 ఇండ్లు నిర్మించారు. ఫ్యాక్టరీ మూసేసిన అనంతరం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే, తమకు అక్కడ నివాస స్థలాలు మంజూరు చేయాలని 2002లో ఫ్యాక్టరీ కార్మికులు విన్నవించుకున్నారు. 2016లో హైకోర్టును ఆశ్రయించి కార్మికులు న్యాయపోరాటం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022 జూన్ 8న అమృత్‌నగర్ హౌసింగ్ సొసైటీ కార్మికులకు సర్వేనెంబర్ 825 నుంచి 833 వరకు ఉన్న 50 ఎకరాల భూమిని ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలకు కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు కాపీని జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీఓకు, తహసీల్దార్‌కు కార్మికులు అందజేశారు.కానీ ఇప్పటివరకు కార్మికులకు ఇండ్ల స్థలాలు కేటాయించలేదు. ఇదే క్రమంలో భూములు ఖాళీగా ఉండటంతో ఆక్రమణ గురవుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి షుగర్ ఫ్యాక్టరీ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.