Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట
- ఉద్యమాల అణచివేతకు కుట్ర: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
నవతెలంగాణ - కల్వకుర్తి టౌన్
డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు వెంటనే పంపిణీ చేయాలని చేపట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిని పోలీసులు అడ్డగించారు. శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరితో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ ఆలస్యమైందంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీపీఐ(ఎం) జిల్ల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, నాయకులు ఆంజనేయులు, పరశురాములు, బాల్‌రెడ్డి, శివరాములు తదితర నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వర్ధం పర్వతాలు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు పాలకులు కుట్ర పడుతున్నారన్నారు. పోలీసులను ఉపయోగించి అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేండ్లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.