Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యం తగదు
- విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తే పోరాటం తప్పదు.. : ఉపాధ్యాయ సమస్యలపై సీఎంకు యూఎస్పీసీ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల పట్ల ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) విమర్శించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ కమిటీ నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్పీసీ స్టీరింగ్ కమిటి సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్‌కుమార్, ఎం రవీందర్, ఎం రఘుశంకర్‌రెడ్డి, టి లింగారెడ్డి, యు పోచయ్య, ఎస్ మహేశ్, దూడ రాజనర్సుబాబు, యానం విజరుకుమార్ మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులకు ఉన్న ఆటంకాలు తొలిగిపోయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నదో తెలపాలని డిమాండ్ చేశారు. వాటిని చేపడతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం వాగ్దానం ఆచరణకు నోచుకోకపోవటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. విద్యాశాఖ మంత్రి కూడా మాట తప్పారని విమర్శించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో వేలాది సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తగినంత మంది ఉపాధ్యాయులు లేరని తెలిపారు. తక్షణం వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం విద్యా వాలంటీర్లనైనా నియమించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు-మన బడి, ఇంగ్లీషు మీడియం పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే..సరిపడా ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారుల కొరతను తీర్చాలన్నారు. సర్వీస్ పర్సన్ల నియామకం లేక పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వాహణ అధ్వాన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యత అప్పగించినట్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఎక్కడా అమలు కూడా లేదని తెలిపారు. కేజీబీవీ,యూఆర్ఎస్, సమగ్రశిక్షనా కార్యక్రమాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్‌పే అమలు చేయకుండా శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని విమర్శించారు. కేజీబీవీ ఎస్ఓలకు ఏ మాత్రం సంబంధం లేని మోడల్ స్కూల్ వసతిగృహ నిర్వహణా బాధ్యతలను బలవంతంగా అప్పగించారని చెప్పారు. మోడల్ స్కూళ్లు ప్రారంభమై తొమ్మిదేండ్లయిందన్నారు. అయినా ఇప్పటి వరకు బదిలీలు, పదోన్నతులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. అప్‌గ్రేడెడ్ ఆశ్రమ పాఠశాలలకు 1,192 నూతన పోస్టులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏడేండ్లయినా సచివాలయంలోనే మూలుగుతున్నాయని తెలిపారు. వీటిని పరిశీలించే తీరిక వీరికి లేదా? అని ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందలేదని చెప్పారు. ప్రధానంగా విద్యాశాఖ డైరెక్టర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు ఆరోపించారు.విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పందించాల్సిన శాఖాధిపతి(డీఎస్ఈ) అందుబాటులో ఉండటం లేదన్నారు. డీఎస్ఈ కార్యాలయంలో నిర్దిష్టమైన సందర్శన వేళలు లేవన్నారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సర్వీసు సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణిని కొనసాగుతున్నదని తెలిపారు. డీఎస్ఈ ధోరణి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలనీ, లేదా ఆ అధికారినే మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటమంటే..విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయటమేనన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పలు మార్లు యూఎస్పీసీ ఆధ్వర్యంలో సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించామనీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శికి వినతి పత్రాలు అందించామని తెలిపారు. అయినా పరిష్కారంలో పురోగతి లేదన్నారు.తమ సమస్యలు చెప్పుకుందామని సీఎం అపాయింట్మెంట్ అడిగినా దొరకలేదని ఆందోళన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే బహిరంగ లేఖ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే అనివార్యంగా దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తాయని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోరాట కార్యక్రమాలు..
- సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని యూఎస్పీసీ తీర్మానించింది. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలి.భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి. అదే రోజు సాయంత్రం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టి, కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించాలి.
- దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతూ సెప్టెరబర్ 4న జిల్లా కేంద్రాల్లో టీచర్ల సామూహిక నిరాహారదీక్షలు నిర్వహించాలి.
- సెప్టెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించాలి.
- అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే దసరా సెలవుల్లో వేలాది మంది ఉపాధ్యాయులను సమీకరించి చలో అసెంబ్లీ, సెక్రటేరియేట్ నిర్వహించాలి.