Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాగజ్‌నగర్‌లో కుంగిన పెద్దవాగు వంతెన
- మరమ్మతులు కరువు
- తాజా వర్షాలకు ప్రమాదకర స్థితిలోకి..
- వాహనాల రాకపోకలు బంద్
- ఇబ్బందులు పడుతున్న రైతులు, విద్యార్థులు
- వ్యాపారులపైనా తీవ్ర ప్రభావం
నవతెలంగాణ- కాగజ్‌నగర్
ఈ సమస్య కేవలం రైతులు, విద్యార్థులదే కాదు. ఈ వంతెన బంద్ అవడం వల్ల ఆర్థిక నష్టాలూ ఉన్నాయి. అటు వ్యాపారులు, ఇటు ప్రజలతోపాటు అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే రోగులకు అష్టకష్టాలు తప్పడం లేదు. కాగజ్‌నగర్ నుంచి దహెగాం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరందరి ఇబ్బందులకు ప్రధాన కారణం పాలకులు, అధికారుల నిర్లక్ష్యమే. కాగజ్‌నగర్- దహెగాం మండలా లను కలుపుతూ అందవెల్లి గ్రామం వద్ద పెద్దవాగుపై 2001లో హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన గతేడాది వర్షాకాలంలోనే పెద్దవాగు వరద ఉధృతికి కుంగిపోయింది. అప్పట్లో కొన్ని రోజులపాటు వంతెనపై నుంచి రాకపోకలు నిలిపేసిన అధికారులు తర్వాత యథావిధిగా రాకపోకలను పునరుద్ధరించారు. అప్పట్లోనే సమస్యను గుర్తించి వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు మళ్లీ పెద్దవాగు పొంగి ప్రవహించింది. గతేడాది దెబ్బతిన్న వంతెన పిల్లర్ ఈసారి మరింత కుంగింది. దీనితో వంతెన వంగిపోయి ప్రమాదస్థాయికి చేరుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారులు ఇప్పుడు మేల్కొన్నారు. తక్షణమే రాకపోకలు నిలిపేసి.. వంతెనకు ఇరువైపులా గోడలు నిర్మించారు.
ఈ సమస్యకు పరిష్కారమెప్పుడో..?
ఈ వంతెన మీదుగా మూడు మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్‌నగర్, దహెగాం, పెంచికల్‌పేట మండలాల ప్రజలు నిత్యం ఇటు నుంచి అటు, అటు నుండి ఇటు వెళ్తారు. కాగజ్‌నగర్ మండలం బోడేపల్లి, జగన్నాథ్‌పూర్, దహెగాం మండలం రాళ్లగూడ, ఇట్యాల, కొత్మీర్ గ్రామాల విద్యార్థులు నిత్యం కాగజ్‌నగర్‌లోని ప్రయివేట్ పాఠశాలలకు వస్తూ పోతుంటారు. వారంతా ఇప్పుడు తమ గ్రామం నుంచి కాలినడకన వంతెన దాటి ఇవతల వైపున ఉన్న ఆటోలు, పాఠశాల బస్సులను ఆశ్రయిస్తున్నారు. గ్రామం నుంచి తాము ఏడు గంటలకే బయల్దేరాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. ఎడ్లబండి కూడా వెళ్లే మార్గం లేకపోవడంతో ఎద్దులను తోలుకొని, నెత్తిన వ్యవసాయ సామాగ్రి పెట్టుకొని కాలినడకన వెళుతున్నారు. వంతెన మరమ్మతులకు నిధులు విడుదలయ్యేది ఎపుడో, తమ సమస్య పరిష్కారమయ్యేది ఎప్పుడోనని ఆయా మండలాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వంతెన మరమ్మతులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పెద్దవాగులో పైపులు వేసి పైన మట్టితో రహదారి ఏర్పాటు చేస్తే కాస్తయినా రహదారి సౌకర్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
చుక్కలనంటుతున్న ధరలు
ఈ వంతెన పుణ్యమాని కాగజ్‌నగర్ మార్కెట్లో గిరాకీ గణనీయంగా తగ్గింది. మండలంలోని పలు గ్రామాలతో పాటు దహెగాం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇదివరకు కాగజ్‌నగర్ మార్కెట్‌కు వచ్చేవారు. ఏ చిన్న అవసరం వచ్చినా వారు కాగజ్‌నగర్ మార్కెట్ మీదనే ఆధారపడే వారు. వంతెనపై ఇప్పుడు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వీరంతా కన్నెపెల్లి మీదుగా బెల్లంపల్లి, మంచిర్యాలకు వెళుతున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు కూడా కాగజ్‌నగర్ మార్కెట్ నుండే నిత్యం సరుకులను దహెగాం మండలంలోని తమ దుకాణాలకు తీసుకువెళ్లే వారు. ఇప్పుడు ఆ సౌకర్యం లేకపోవడంతో వారు బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాలపై ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా దహెగాంతో పాటు ఇతర గ్రామాల వ్యాపారులు నిత్యావసర వస్తువులపై ధరలు పెంచేశారు. చేసేదేమీ లేక అధిక ధరలకు సరుకులు కొంటూ అటు దహెగాం మండలవాసులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇటు కాగజ్‌నగర్ మార్కెట్ వ్యాపారులు గిరాకీ లేక నష్టపోతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం:లక్ష్మినారాయణ- డీఈ- ఆర్అండ్బీ
వంతెన మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ప్రభుత్వం కూడా నిధుల మంజూరుకు అనుమతించింది. త్వరలోనే డిజైన్ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి కూడా ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం.
సైకిల్‌పై వెళుతున్నా : ఆదె కార్తీక్- తొమ్మిదో తరగతి
వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేయడంతో ప్రతి రోజూ పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నా. ఇంతకు ముందు పాఠశాల బస్సు మా గ్రామం వరకు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. మా గ్రామంలో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా కాలినడకన వంతెన దాటి అవతల ఆటోలో పాఠశాలకు వస్తున్నారు. దీంతో పాఠశాలకు ఆలస్యమవుతోంది.
కూలి గిట్టుబాటు కావడం లేదు:గడీల ప్రవీణ్- ఇటుకబట్టీ కార్మికుడు
మాది బోడేపల్లి గ్రామం. నేను ప్రతి రోజూ కాగజ్‌నగర్‌లోని ఇటుక బట్టీకి వెళ్లి పని చేస్తుంటాను. తయారు చేసే ఇటుకలను బట్టి రేటు ఇస్తుంటారు. ఇంతకుముందు రోజుకు రూ.500 నుంచి రూ.600 సంపాదించేవాడిని. ఇప్పుడు వంతెన మీదుగా రాకపోకలు లేకపోవడంతో కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆలస్యమై తక్కువ ఇటుకలు తయారు చేస్తున్నాను. దీంతో కూలి రోజుకు రూ.300 దాటడం లేదు. త్వరగా వంతెన నిర్మిస్తే బాగుంటుంది.