Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో నిర్వహణ
- 200 మంది కళాకారులతో 18రకాల కళారూపాలు
- స్వాతంత్య్ర పోరాట వీరగాథలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
భిన్న సంస్కృతుల మేళవింపుల సొంపు హైదరాబాద్. గంగా జమునా తెహజీబ్‌గా పేరొందిన సప్తవర్ణ శోభిత నగరం. 1591 కులీ కుతుబ్‌షా దీనిని నిర్మించారు. ముత్యాల నగరంగా ప్రపంచ ఖ్యాతినొందింది. చెరువులో చేపల్లా నా నగరం వృద్ధి పొందాలన్న కుతుబ్‌షా కలలు కోటి మంది జనాభాతో సాకారమైంది. విభిన్న భాషా సంస్కృతులు, జీవన వైవిధ్యాలు, మన సంప్రదాయాలు, కళలు, సాహిత్యం-బహుముఖాభివృద్ధికి కేంద్రం భాగ్య నగరం. విద్య, వినోదం, విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనలు, సాహిత్య ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని హైదరాబాద్ జిందాబాద్. వివిధ రంగాలు, సంస్కృతులు అన్నీ ఒకే వేదికగా చూపించే ప్రయత్నంగా 'హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్-2022' ఈనెల 28న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు 28న రవీంద్రభారతి మెయిన్ హాల్లో భారత స్వాతంత్ర వజ్రోత్స వాల సందర్భంగా కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కల్చరల్ ఫెస్టివల్లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రజాకవులు గోరటి వెంకన్న, జయరాజు, సుద్దాల అశోక్‌తేజ హాజరు కానున్నారు. ఈ కల్చరల్ ఫెస్టివల్లో 18 రకాల కళారూపాలలో సుమారు 200 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామ కళారూపాయల ప్రదర్శన ఉంటుంది. కల్చరల్ ఫెస్ట్‌లో భారత స్వాతంత్ర పోరాటయోధుల వీరోచిత పాత్రను చాటి చెప్పే ప్రదర్శనలు, భారత రాజ్యాంగ విశిష్టత సాటి చెప్పే కళారూపాలు ఉంటాయి. ప్రముఖ మెజీషియన్లు చొక్కాపు వెంకటరమణ బృందం, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మల్లం రమేష్ బృందం, ప్రముఖ కళాకారులు జెన్నీ, లోహిత్, ఫోర్ లెగ్ కిరణ్ ప్రదర్శ నలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ వజ్రోత్సవాల సందర్భంగా నగరంలో సుమారు 90 హైస్కూల్స్‌లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు, కళా ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు ప్రముఖులకు ఇచ్చి సత్కరించనున్నారు.
హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం:హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య
హైదరాబాద్ జిందాబాద్ ఒక పౌర సంస్థ. హైదరాబాద్ నగరాన్ని ఒక నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దాలనేది మా ఆకాంక్ష. ఉచిత మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరిరక్షణకు, విద్యా ప్రజలకు అందు బాటులో ఉండాలనే ఆశయాలతో మా సంస్థ పనిచేస్తున్నది. ప్రతి సంవత్సరం రవీంద్రభారతిలో కళా ప్రదర్శనల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించాలని మా ఉద్దేశం. అందులో భాగంగా జరిగే మా ఈ ప్రయత్నానికి మీ తోడ్పాటు నందించాల్సిందిగా విజ్ఞప్తి.
కల్చరల్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
కల్చరల్ ఫెస్టివల్ పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని నల్లకుంటలో నల్లకుంట రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైజర్ జయసూర్య ఆవిష్కరించారు. డాక్టర్ జయసూర్య మాట్లడుతూ.. ప్రపంచంలో కాలుష్యం బాగా పెరిగి పోతున్నదని, మన దేశంలోనూ విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నివారించి, పర్యావరణాన్ని కాపాడటానికి విద్యార్థులతోపాటు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 28న రవీంద్రభారతిలో జరిగే కల్చరల్ ఫెస్టివల్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైజర్స్ అధ్యక్షులు వి. మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి వీరయ్య, నాయకులు శ్రీనివాస్‌రావు, రాజీవ్, డా.అమర్నాథ్, కృష్ణబాబు, ఉత్తమ్, అశ్వీన్, వేెణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.