Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నితిన్, మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ
- జయసుధతోనూ టచ్‌లో బీజేపీ నేతలు
- తమకు అనుకూలంగా ఉండాలని వారిపై ఒత్తిడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదవులు ఊరికే ఇవ్వరు... ఏదో ఒక ప్రయోజనం ఆశించే ఇస్తారు...అనే దాన్ని బీజేపీ అక్షరాలా నిజం చేస్తున్నది. ఆ కోవలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్రప్రసాద్‌కు రాజసభ సభ్యత్వం కట్టబెట్టినట్టు ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే ఇట్టే అర్ధమవుతున్నది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై పట్టుసాధించేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. రాజకీయ పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్న బీజేపీ చివరకు క్రీడాకారులు, సినీతారలను కూడా వారి ప్రయోజనాలు, బలహీనతల ఆధారంగా రాజకీయంగా వాడుకునేందుకు పావులు కదుపుతున్నది. అందులో భాగంగానే ఎదురొచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా పార్టీ ఎదుగుదల కోసం వాడుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అందులోనూ విస్తృత అభిమానులున్న హీరోలపైనా, ప్రధానంగా తెలంగాణ నేపథ్యమున్న వారిపై దృష్టి సారిస్తున్నది. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ రచయిత, చిత్రపరిశ్రమ సామ్రాజ్యధినేతగా పేరొందిన మరొకరు దీనికి కర్త, కర్మ, క్రియలుగా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఒంటరిగా భేటీ అయిన విషయం తెలిసిందే. మరోవైపు శనివారం నాడు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో హీరో నితిన్, భారత జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు, రచయితలు, క్రీడాకారులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం ప్రత్యేకంగా భేటీకానున్నారు. ఈ సమావేశం ఫక్తు రాజకీయ కోణంలో జరుగబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ నుంచి చిత్రసీమలో అడుగుపెట్టి సక్సెస్ అయిన అతి కొద్ది మంది నటుల్లో ఒకరుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నితిన్ గుర్తింపు పొందిన విషయం విదితమే. గతంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధతోనూ బీజేపీ చేరికల కమిటీ మంతనాలు సాగిస్తున్నది. ఆమె కూడా ఆ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో టాలీవుడ్లో బాగా ప్రాచుర్యం పొందిన రచయితలు, హీరోలనూ దగ్గరకు తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. వీలైతే పార్టీలో చేరండి..లేకున్నా తమ పార్టీ గెలుపు కోసం అంతర్గతంగా కృషి చేయండి అని వారిపై బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎందుకొచ్చిన గోల వెళ్లకపోతే ఆర్థికంగా, క్రీడా, సినీరంగాల్లో ఎక్కడ తమను తొక్కేస్తారో అనే భావనలో ఉన్న సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు ఒప్పుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే నడ్డాతో భేటీ కానున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్న సభకు బాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి కూడా పాల్గొన్న విషయం విదితమే.