Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా దగ్గర కూడా వాటిని అమలుచేయాలని కోరతాం...
- 25 రాష్ట్రాల రైతు నాయకుల వెల్లడి
- హైదరాబాద్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం అమల్జేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటలపాటు ఉచిత కరెంటు తదితర పథకాలు ఇక్కడి అన్నదాతలకు భరోసాను, మనోధైర్యాన్ని ఇస్తున్నాయని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రతినిధులు ప్రశంసించారు. వాటితోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా భేషుగ్గా ఉందని వారు కితాబిచ్చారు. టీఆర్ఎస్ సర్కారు అమల్జేస్తున్న ఇలాంటి పథకాలు, కార్యక్రమాలను తమ తమ రాష్ట్రాల్లో కూడా అమల్జేయాలంటూ అక్కడి ప్రభుత్వాలను కోరతామంటూ వారు చెప్పారు. మన రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకోసం 25 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. వారు నగరం నుంచి జిల్లాల పర్యటనకు బయలు దేరే ముందు మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించడానికే తాము తెలంగాణకు వచ్చామని వారు ఈ సందర్భంగా తెలిపారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం అమల్జేస్తున్న విధానాలను తమ తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలంటూ అక్కడి ప్రభుత్వాలను కోరతామని అన్నారు. తెలంగాణలో ఎలాంటి నష్టాలు లేకుండా, రైతుకు లాభసాటిగా వ్యవసాయాన్ని పరుగులు పెట్టించటం హర్షణీయమని అన్నారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్ మాట్లాడుతూ ... ఎకరానికి రూ.10 వేల మేర రైతుబంధు సాయం, రూ.ఐదు లక్షల రైతు బీమా అనేవి దేశ చరిత్రలోనే గొప్ప పథకాలని తెలిపారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కిసాన్ ఆందోళనలో పాల్గొన్న సీఎం కేసీఆర్... అమరులైన రైతులకు ఆర్థికసాయం అందించడం అభినందనీయమని తెలిపారు. ఆయన తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడని కొనియాడారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిషా, పంజాబ్, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు పాల్గొన్నారు.