Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ బీజేపీ జేబు సంస్థ
- పథకం ప్రకారమే ఆరోపణలు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదా?: హరీశ్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో/మెహదీపట్నం
'బీజేపీకి ప్రతిపక్షాలే టార్గెట్‌గా పనిచేస్తూ పాలన మరిచిపోయిందని, సీబీఐ.. బీజేపీ జేబు సంస్థగా మారిందని ప్రజలకు తెలుసని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీబీఐ నోటీసులిస్తోందని ఆ పార్టీ ఎంపీ ఎలా చెబుతారని, ఇది ఉద్దేశపూర్వకమైన కుట్ర కాదా అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో మోడ్రన్ కిచెన్, దోబీఘాట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ.. దొడ్డి దారిన అధికారం చేజిక్కించుకుందన్నారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, నిన్న జార్ఖండ్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. బీజేపీ పరిపాలన వదిలి ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో పని చేస్తుందని, ఇంది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నిస్తే దాడులు చేస్తోందని, సీబీఐ నోటీసులిస్తుందని బీజేపీ ఎంపీ ఢిల్లీలో ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ డైరెక్షన్లో సీబీఐ పనిచేస్తుందని, సీబీఐ, ఇతర నిఘా సంస్థలు ఇవ్వాల్సిన స్టేట్మెంట్లను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలా ఇస్తుందని చెప్పారు. చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్నదేంటని, మతకలహాలు దేశానికి, రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకొచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణలో పారిస్తున్నారని, భూమికి బరువయ్యే పంట పండుతుందన్నారు. కేంద్రం పంటలు కొనలేమని చేతులు ఎత్తేసిందన్నారు. కృష్ణా, గోదావరి నీరు తెలంగాణలో పారాలని మేం ప్రయత్నిస్తుంటే, బీజేపీ మతకలహాలు జరిగి రక్తం పారాలని చూస్తున్నదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నామని ఎందుకివ్వలేదన్నారు. మేం 80 శాతం మంది పేదలకు ఉచితాలు ఇస్తే, మీరు 20 శాతం మంది కార్పొరేట్లకు రూ.10లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండని విమర్శించారు. కర్నాటకలో కాంట్రాక్టర్ అసోషియేషన్ స్టేట్మెంట్ వచ్చిందని, అక్కడ బిల్లులు రావాలంటే 40 శాతం లంచం ఇస్తే తప్ప రావడం లేదన్నారు. అందుకే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ విషయంపై సీబీఐ, ఈడీ ఎందుకు దాడులు చేయడంలేదని ఆరోపించారు. కర్నాటకలో సీఎం పదవి కావాలంటే రూ.2500 కోట్లు ఇస్తే అవుతారని, బీజేపీ ఎమ్మెల్యేలే ప్రకటన చేస్తే దాని మీద ఎందుకు విచారణ చేయరని ప్రశ్నించారు. కర్నాటకలో ఎస్ఐ ఉద్యోగాల్లో అవినీతి అంటే పట్టించుకోవడం లేదని చెప్పారు. మీతో మంచిగా ఉంటే నీతిమయం, ప్రశ్నిస్తే అవినీతిమయం అన్నది బీజేపీ విధానంగా ఉందన్నారు.