Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలు చెల్లించండి
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళాభ్యున్నతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయవంతం కోసం కృషి చేస్తున్న ఐకేపీ వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో గ్రామస్థాయిలో 17,600 మంది వీఓఏలు పనిచేస్తున్నారని వివరించారు. వారు 18 ఏండ్ల నుంచి గ్రామాల్లో మహిళాభ్యున్నతి, మహిళ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్‌హెచ్‌జీ సమావేశాలు నిర్వహించి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారని వివరించారు. ఎస్‌హెచ్‌జీ, అకౌంటింగ్, ఆన్లైన్ పనులు ఇలా రోజురోజుకీ కొత్త కొత్త సర్వేలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాల విజయవంతానికి వారు కృషి చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు తాత్కాలిక పద్ధతుల్లో పనిచేస్తున్న వీఓఏల లాంటి వారినీ రెగ్యులరైజ్ చేస్తామంటూ టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నెలకు రూ.ఐదు వేల గౌరవ వేతనం ఇస్తామంటూ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. సెర్ప్ నుంచి కేవలం రూ.3,900 గౌరవ వేతనం పొందుతున్నారని తెలిపారు. వారి సమస్యలపై ఉన్నతాధికారులకు, మంత్రికి విన్నవించినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారని గుర్తు చేసినా ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలనీ, గుర్తింపు కార్డులిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా వ్యక్తిగత ఖాతాల ద్వారా వారికి కనీసం వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ప్రసూతి సెలవులివ్వాలని సూచించారు. అర్హులైన వీఓఏలను సీసీలుగా అప్‌గ్రేడ్ చేయాలని తెలిపారు. గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. వారికి ఒకే రకమైన యూనిఫారాలివ్వాలనీ, ప్రతి గ్రామసంఘానికీ ల్యాప్‌టాప్‌తోపాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.