Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాట్ చైర్మెన్ అల్లం నారాయణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై సానుకూల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్‌తో సంబంధం లేకుండా సామాన్య జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇండ్లు నిర్మించుకోవడానికి సుప్రీం తీర్పు అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని అకాడమీ భవన్లో సీనియర్ జర్నలిస్టు వంశీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఎ.మారుతిసాగర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ప్రగతిభవన్‌లో, కేసీఆర్ అనేకసార్లు చర్చించి స్థలాల కేటాయింపుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇండ్ల స్థలాల కేటాయింపు సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండటంతోనే ఇప్పటిదాకా ఆలస్యమైందని గుర్తు చేశారు. హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, కార్యదర్శి వంశీ మాట్లాడుతూ యూనియన్లు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 13 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డబ్బులు సర్ద లేక, భార్య పుస్తెలు తాకట్టుపెట్టి రెండు లక్షలు కట్టిన వారి కల సాకారమయ్యే రోజు వచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించాలి: బసవపున్నయ్య
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ గత 35 ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదన్నారు. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి తోలగిపోయిందనీ, సీఎం కేసీఆర్ వెంటనే గతంలో మాదిరిగానే చొరవచూపి క్యాబినెట్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే పైళ్లకు ఆమోదం తెలపాలని కోరారు. ఇండ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా కేసీఆర్ సర్కారు చరిత్ర సృష్టించాలని విజ్ఞప్తి చేశారు.