Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేప, రొయ్య విత్తన క్షేత్రాలను అభివృద్ధి చేయాలి
- తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత్స్య సొసైటీలకు చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. 83 మంది టెండర్దారులు తప్పుడు ఈఎమ్డీలు, తప్పుడు బ్యాంకు గ్యారెంటీ దస్తావేజులు సమర్పించి అవినీతికి తెరలేపారనీ, దీంట్లో మత్స్యశాఖ రాష్ట్రస్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉందని విమర్శించారు. టెండర్ ద్వారా ఒక్కో చేప, రొయ్య పిల్లకు రూ.2 తీసుకున్నారని తెలిపారు. ఏపీలోని ధవళేశ్వరం వద్ద ఒక్కో రొయ్య పిల్లకు ఐదు నుంచి పది పైసలు మాత్రమే వెచ్చించారని చెప్పారు. ఇలా ఒక్కో పిల్ల విషయంలో రూపాయి 90 పైసల దాకా అవినీతి జరిగిందని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ అవినీతిలో పాలుపంచుకున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్దారుల ఈఎమ్డీలు జప్తు చేయాలని కోరారు. ఆయా సంస్థలను టెండర్లలో పాల్గొనకుండా నిషేదించాలన్నారు. మత్స్యకారులకు అన్యాయం జరుగకుండా వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేరుగా సొసైటీల బ్యాంకుల ఖాతాల్లోనే నగదు జమ చేయాలని కోరారు. చేప, రొయ్య పిల్లల కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదంటూ ఐదేండ్లుగా తాము మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లోపాన్ని గుర్తించి ప్రతి రిజర్వాయర్లోనూ చేప, రొయ్య పిల్లల విత్తన క్షేత్రాలను అభివృద్ధి చేయాలనీ, దాని కోసం రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తేలు ఇస్తారి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎస్. శ్రీను పాల్గొన్నారు.