Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నినదించిన సమరయోధులు
- బ్రహ్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వాతంత్య్ర పరిరక్షణ తమ జన్మహక్కు అని పలువురు స్వాతంత్య్ర సమరయోధులు నినదించారు. తాము జైళ్లకు వెళ్లి, బ్రిటీష్ లాఠీ దెబ్బలు తిన్నది దేశ స్వాతంత్య్రాన్ని ఇష్టం వచ్చినట్టు నిర్వచించేందుకు కాదని స్పష్టం చేశారు. భావితరాలకు స్వాతంత్య్ర ఫలాలు అందాలంటే పాత, కొత్త తరాలకు వారధిగా ఇప్పటి నడివయస్కులు నిలవాలని కాంక్షించారు. బ్రహ్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో 75 ఏండ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ వ్యవస్థాపకులు, న్యాయవాది మయబ్రహ్మ నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల్ని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. స్వతంత్ర పోరాట ఘట్టాలు, వారి అనుభవాలను సభికులతో పంచుకున్నారు. వారితో పాటు కార్యక్రమంలో మాజీ సైనికులు, రైతులు, ఉపాధ్యాయులు, పోలీసులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తల్ని మయబ్రహ్మ దంపతులు సన్మానించారు. అమన్ వేదిక విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సభికుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మయబ్రహ్మ నర్సింహా మాట్లాడుతూ త్యాగాల పునాదులపై ఏర్పడిన దేశ స్వాతంత్య్రం ఇప్పుడు గతి తప్పుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతంపేరుతో ప్రజల మధ్య విభజన తెస్తున్నారనీ, ఇది దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుందన్నారు. వీఆర్ రామాచారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులకు, భావితరాల విద్యార్థులకు మధ్య మయబ్రహ్మ సంధానకర్తగా నిలిచి, పోరాట స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారని ప్రసంసించారు. కార్యక్రమంలో సొసైటీ కోఆర్డినేటర్ ఎమ్ఎస్ రాఘవేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి బీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ముగింపు సమయంలో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావు విచ్చేసి, స్వాతంత్య్ర సమరయోధులకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు.