Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో అగ్రికల్చర్ బిజినెస్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ సంస్థ కృషి చేస్తున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో కన్వకేషన్-2022కు కేంద్ర మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తోమర్ మాట్లాడుతూ రైతులకు సేవ చేసే అవకాశం దక్కినందుకు మేనేజ్ విద్యార్థులు గర్వపడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ అభివద్ధిలో వారి సేవలు అవసరమని వివరించారు. ఉద్యోగం చేసుకుంటూనే దేశంలోని రైతులకు సేవ చేసేందుకు మేనేజ్ విద్యార్థులు తమ సమయాన్ని కేటాయించాలని కోరారు. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ నిర్వహణ సామర్థ్యలతో వ్యవసాయంలో ప్రపంచ నాయకత్వస్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తుందని చెప్పారు. భారత్ అగ్రికల్చర్‌ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు అనుసంధానం చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 200లకు పైగా అగ్రి సంస్థలను ప్రారంభించి అగ్రికల్చర్ బిజినెస్ రంగంలో అవగాహన కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా 2018-22 మూడు బ్యాచ్‌ల నుంచి 202 మంది డిప్లొమా పొందిన అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్,- పీజీడీఎం(ఏబీఎం) విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. మూడు వరుస బ్యాచ్‌ల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు బంగారు, రజతం, కాంస్య పథకాలను అందుకున్నారు.
అగ్రి-వెంచర్లతో వ్యవసాయ రంగంలో కృషి చేసిన ముగ్గురు పూర్వ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ మనోజ్ అహుజా, మేనేజ్ ఫ్యాకల్టీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.