Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 1714 ఎకరాలు అవసరం
- అభ్యంతరాల స్వీకరణకు గ్రీన్‌సిగల్ : కేంద్రం ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు గెజిట్లు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అవసరమైన భూసేరణ చేయడంతోపాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశించింది. ఈమేరకు ఈనెల 23న కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వెంటనే ఆర్ఆర్ఆర్ పనుల నిర్మాణ ప్రక్రియకు కావల్సిన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లల్లో ఉన్న అవుటర్ రింగు రోడ్డు అవతల రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 1714 ఎకరాలకుగాను అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది. ఇప్పటికే యాదాద్రి-భువనగిరి జిల్లాలో భూసేకరణకు రెండు గెజిట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర భాగంలో 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో 182 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగు రోడ్డును నిర్మించాల్సి ఉంది. దీనికి భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో భాగంగా సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో 1714 ఎకరాల మేర సేకరించాల్సి ఉంటుంది. స్థానికంగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఆయా చోట్ల 21 రోజుల్లోగా అభ్యంతరాలు స్వీకరించాలని కేంద్రం కోరింది. స్థానికంగా రెవెన్యూ అధికారులతోకూడిన కాంపిటెంట్ అథారిటీ భూసేకరణ అభ్యంతరాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజల నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని కేంద్ర జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్ఏఐ)కి పంపుతారు. ఆ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వాటి స్వభావాన్ని బట్టి నష్టపరిహారంతోపాటు ఇతర చర్యలూ తీసుకుంటారు. ఇదిలావుండగా చౌటుప్పల్, జోగిపేట తదితర ప్రాంతాల్లో చేపట్టిన అభ్యంతరాల స్వీకరణ గతంలో ఒక తంతుగా సాగినట్టు అరోపణలు వచ్చాయి. ఫిర్యాదులను తీసుకోవడమే తప్పితే ఇంతవరకు ఆర్ఆర్ఆర్లో భూమి కోల్పోయిన రైతులకుగానీ, ప్రయివేటు వ్యక్తులకుగానీ ఎలాంటి పరిహారం చేతికందలేదని సమాచారం.
4700 ఎకరాలు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ (3ఎ)లో యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల గుండా ఆర్ఆర్ఆర్ వెళ్లనుంది. అందులో అత్యధికంగా యాదాద్రి -భువనగిరి, సిద్ధిపేటతోపాటు సంగారెడ్డి, మెదక్‌లో నాలుగు మండలాల చొప్పున ఉన్నాయి. 19 మండలాల్లోని 113 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కాగా, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 15 గ్రామాలుండగా, అదే జిల్లాలో కౌడిపల్లె మండలంలో మాత్రం ఒకే గ్రామం గుండా ఈ రింగురోడ్డు వెళ్ళనుంది. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి మొత్తం 4704.99 ఎకరాల భూమి అవసరం కానుంది. అలాగే ఆమోదముద్ర వేసిన ఉత్తరభాగం రోడ్డుకు రానున్న రోజుల్లో ఎనిమిది లైన్లకు విస్తరించేలా 100 మీటర్ల వెడెల్పుతో భూసేకరణ చేసి, ప్రస్తుతానికి నాలుగు వరుసలతోనే నిర్మించనున్నారు.